భర్తలు అందంగా ఆకర్షణీయంగా ఉంటే భార్యలు ఎలా ఫీలవుతారనే దాని పై చేసిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
న్యూయర్క్: భర్తలు అందంగా ఆకర్షణీయంగా ఉంటే భార్యలు ఎలా ఫీలవుతారనే దాని పై చేసిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు ఇటీవల డల్లాస్ ఏరియాలో ఉండే కొత్తగా పెళ్లయిన 113 జంటలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం నాలుగు నెలల క్రితమే పెళ్లైనా 20 ఏళ్ల వారిని ఎంపిక చేసుకున్నారు. వీరికి పలు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాబట్టారు. ఈ సమాధానాలు విశ్లేషించిన ప్రముఖులు అంతిమంగా ఏ నిర్ణయానికి వచ్చారంటే.. తమ కంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపించే భర్తలున్న యువతులు కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారట.
అందంగా కనిపించడానికి వీళ్లు తిండి విషయంలో కఠినంగా ఉంటున్నారట. అంతేకాదు అవసరమైన ఆహారం తీసుకోకుండా డైటింగ్ చేస్తూ మరింత అనారోగ్యంగా తయారవుతున్నారని తేలింది. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన, జీవితంపై విరక్తి వంటి మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారట. అయితే అందంగా ఉండే యువతులు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టమైంది. ఈ పరిశోధనలో పురుషులు మాత్రం అలాంటివి పట్టించుకోరనే విషయం తేలింది. భర్తలు మాత్రం భార్య తన కన్నా అందంగా ఉందా, మామూలుగా ఉందా, తక్కువ అందంగా ఉందా అన్న విషయాలను పెద్దగా పట్టించుకోరని కూడా పరిశోధనలో రుజువైంది.