
రూపాయిపైనే ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. మరోవైపు అమెరికన్ కరెన్సీ డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆహార భద్రతసహా పలు బిల్లులు చర్చకు రానుండటంతో వీటికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. కంపెనీల ఫలితాల సీజన్ ముగియడంతోపాటు, మార్కెట్లను ప్రభావితం చేయగల దేశీయ అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లపైనే చూపు నిలుపుతారని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్‌జీ కె.రీటా చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం విడుదల చేయనున్న పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్) ప్రపంచ స్టాక్ మార్కెట్లకు కీలకంకానున్నాయని తెలిపారు.
క్యాపిటల్ కంట్రోల్ భయాలు: ప్రభుత్వం 1991 తరహాలో పెట్టుబడులపై నియంత్రణలను(క్యాపిటల్ కంట్రోల్) తీసుకువస్తుందన్న ఆందోళనలతో గడిచిన శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక్కసారిగా 62కు పడిపోయింది. కొత్త చరిత్రాత్మక కనిష్టస్థాయి 61.65 వద్ద ముగిసింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 770 పాయింట్లు పతనమైంది. ఇటీవల భారీ ఒడిదొడుకులకు లోనవుతున్న రూపాయి విలువ కారణంగా ఈక్విటీ మార్కెట్లు కూడా హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ తెలిపారు. ఇది ఇంతటితో ఆగేదికాదని వ్యాఖ్యానించారు. చార్టుల ప్రకారం చూస్తే ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి సమీప మద్దతు స్థాయి 5,450 పాయింట్ల వద్ద ఉన్నదని చెప్పారు. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాలు మరింత ఉధృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇది జరిగితే నిఫ్టీ 5,300 స్థాయికి దిగజారుతుందని అంచనా వేశారు. ఫలితంగా ట్రేడర్లు ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో పొజిషన్లు తీసుకోవడం ప్రమాదకరమని సూచించారు. కాగా, రానున్న రోజుల్లో నిఫ్టీకి 5,480 స్థాయి కీలకంగా నిలవనున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలకు మరింత అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు.
జోష్‌లో యూఎస్: ఇటీవల ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటున్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. గత వారం విడుదలైన నిరుద్యోగం తదితర గణాంకాలు జీడీపీ పురోగమిస్తున్న సంకేతాలను వెల్లడించడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను వచ్చే నెల నుంచే ఉపసంహరించవచ్చునన్న అంచనాలు పెరిగాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలించే అవకాశముంది. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ బలపడింది. ఇది రూపాయి పతనానికి కూడా కారణమైంది. భారతీయులు, దేశీయ కంపెనీలు విదేశాలలో పెట్టేపెట్టుబడులపై రిజర్వ్ బ్యాంకు పరిమితులు విధించడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని నిపుణులు పేర్కొన్నారు. దీంతో విదేశీయులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంపై నియంత్రణలు విధించే ఆలోచన లేదని ఆర్‌బీఐ, ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
రూ. 6,000కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశీయ రుణ(డెట్) మార్కెట్ల నుంచి ఈ నెల తొలి 2 వారాల్లో ఎఫ్‌ఐఐలు నికరంగా 96.2 కోట్ల డాలర్ల(రూ. 6,000 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ తరహా పెట్టుబడులపై లభించే రిటర్న్‌లకు సంబంధించి పన్ను నిబంధనల్లో స్పష్టత లేకపోవడం దీనికి కారణంగా నిలుస్తోంది. మరోవైపు రూపాయి బలహీనపడటం కూడా ఇందుకు సహకరిస్తోంది. కాగా, సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి చూస్తే డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు మొత్తంగా రూ. 51,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే 2013 జనవరి మొదలు తొలి 5 నెలల్లో నికరంగా రూ. 25,000 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.