
యూపీ అసెంబ్లీలో 485 స్థానాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మొత్తం 485 స్థానాలు ఉన్నాయట. అదేంటి ఉన్నది 403 స్థానాలే కదా. అదంతే.. వివాదాస్పద మంత్రి ఆజంఖాన్ లెక్కల ప్రకారం యూపీ అసెంబ్లీలో 485 సీట్లు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన ఈ లెక్కలు చెప్పారు. సమాజ్ వాదీ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా చేశారు.
తమ పార్టీకి 380 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఎస్పీకి 80 సీట్లు, బీజేపీకి 25 స్థానాలు దక్కుతాయని అంచనా కట్టారు. ఈ అంకెలు అన్నీ కలుపుకుంటే 485. కానీ శాసనసభలో ఉన్నది 403 సీట్లే. మిగతా సీట్లు ఎక్కడున్నాయో ఆజంఖాన్ కే తెలియాలి.
ఎన్నికల ఫలితాల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా అలాంటి పరిస్థితి రాదని, తమకు 380 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. కచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని, తనపై నమ్మకం ఉంచాలని అన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.