
పవన్ కళ్యాణ్, ప్రభాస్ లకు షాక్!?
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ అధికారికంగా ప్రకటించిన సినీ, క్రీడారంగ తదితర రంగ ప్రముఖులతో కూడిన 2016 , టాప్ 100 జాబితాలో తెలుగు సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిందా? దేశంలో రెండవ అతిపెద్ద పరిశ్రమగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు అన్యాయం చేసిందా? టాప్ 100 లిస్ట్ లో కేవలం నలుగురికి మాత్రమే చోటు కల్పించి తెలుగు సినీ అభిమానులను నిరాశలో ముంచిందా? శుక్రవారం వెల్లడించిన తాజా జాబితాపై ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు తెలుగుపరిశ్రమకు, తెలుగు స్టార్ హీరోలకు అన్యాయం జరిగిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్ టీఆర్, రామ్ చరణ్ మాత్రమే ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో స్థానం సంపాదించారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల పేర్లు ఆ జాబితాలో కనిపించకపోవడంపై సినీ పండితుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఫోర్బ్స్ అందించిన సమాచారం ప్రకారం ఆదాయం, కీర్తి, గూగుల్ ర్యాంకింగ్స్ , పత్రికల కవర్ పేజీ లాంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రముఖులను ఎంపిక చేస్తారు. అయితే ముఖ్యంగా ఆదాయంలో గానీ, రాజకీయాల్లో గానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ లో గానీ కీలకంగా ఉన్న పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ , మరో ముఖ్యమైన హీరో, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రభాస్ కు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ ఇరువురు సాధించిన నేమ్ అండ్ ఫేమ్ సరిపోలేదా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అటు టాలీవుడ్ జక్కన్న గా పేరు గడించిన బాహుబలి దర్శకుడు రాజమౌళికి 100 జాబితాలో ప్లేస్ దక్కక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.