కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ‘‘అప్పట్లో ఆమె చెయ్యి పట్టుకుని అవమానించావు. ఇప్పుడు శిక్ష తగ్గించమని కోరుతున్నావు. అది జరగాలంటే ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుకో’’ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలివీ. హైదరాబాద్‌లో పదేళ్ల క్రితం జరిగిన కేసు ఇది. నగరంలోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీనగర్‌కు చెందిన ఓ యువతి(ఉదంతం జరిగినప్పుడు మైనర్)ని స్థానికంగా ఉండే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు.
అడుగు బయటపెడితే చాలు నరకం చూ పించేవాడు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు అతడి ప్రవర్తన మితిమీరేది. ప్రేమించానని, పెళ్ళి చేసుకోవాలని వేధించేవాడు. వీటిని కొంతకాలం తట్టుకున్న యువతి చివరకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆ యువకుడిని పిలిచి మందలించారు.
శ్రుతిమించి ఇంట్లోకి ప్రవేశించి..
ఇంత జరిగినా ఆ యువకుడిలో మార్పు రాలేదు. 2005 జనవరి 30న మరింత బరితెగించాడు. ఆ యువతి నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించాడు. అలికిడి విని నిద్రలేచిన యువతి తన గదిలో ఆ యువకుడిని చూసి నిర్ఘాంతపోయింది. కంగారుగా లేచి బయటకు పరుగెత్తాలని ప్రయత్నించింది. దీంతో హఠాత్తుగా ఆమె చేయిపట్టుకున్న యువకుడు మళ్ళీ ‘ప్రేమ.. పెళ్ళి’ అంటూ వేధించాడు.
ఈ పెనుగులాటలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు ఆ యువకుడిపై అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం తదితర నేరాల కింద కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో స్థానిక కోర్టు యువకుడికి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది.
శిక్ష తగ్గింపు కోసం సుప్రీంకోర్టుకు..
ఆ యువకుడు స్థానిక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు శిక్షా కాలాన్ని మాత్రం రెండేళ్ళకు తగ్గించింది. దీంతో అతను సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అప్పటికే ఏడాది పాటు జైల్లో ఉన్న యువకుడి శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు గత నెల 8న బెయిల్ మంజూరు చేసింది. గత వారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె క్షమిస్తేనే అతడికి స్వేచ్ఛ..
కేసు పూర్వాపరాలు, స్థానిక కోర్టు, హైకోర్టు తీర్పుల్ని పరిశీలించిన ధర్మాసనం.. నేరం నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. శిక్షా కాలాన్ని ఏడాదికి తగ్గించాలని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అలా జరగాలంటే ఒకే మార్గం ఉందని సూచించింది. నిందితుడు ఆ యువతి వద్దకు వెళ్ళి, ఆమె కాళ్ళపై పడి క్షమాపణ కోరుకోవాలని, ఆమె క్షమిస్తే శిక్షను ఇప్పటికే అతడు జైల్లో గడిపిన కాలానికి తగ్గిస్తామని స్పష్టం చేసింది. ఖైదా..? స్వేచ్ఛా? తేల్చుకోవడానికి ఆ యువకుడికి అక్టోబర్ 6 వరకు గడువిచ్చింది.