శాంసంగ్ భారత యూజర్లకు భారీ పరిహారం
ముంబై: గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ మార్కెట్ లీడర్ శాంసంగ్ సంబంధిత యూజర్లకు భారీ పరిహారాన్నే అందజేస్తోంది. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇటీవల స్వదేశీ యూజర్లకు క్యాష్ బెనిఫిట్స్ అందించిన ఈ కొరియా సంస్థ ఇపుడు భారతదేశ వినియోగదారులకు కూడా మంచి పరిహారాన్నే ఆఫర్ చేసింది.
ముందుగా దేశంలో గెలాక్సీ నోట్ 7 లాంచింగ్ ఆలస్యం.. తదితర పరిణామాలపై క్షమాపణ చెప్పిన శాంసంగ్ .. ప్రీ బుకింగ్ చేసుకున్న ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ బదులుగా గెలాక్సీ ఎస్ 7 గానీ, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ గానీ అందించనుంది. దీంతోపాటు ఫోన్ రీప్లేస్మెంట్ కోరేవారికి వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్స్, వైర్ లెస్ హెడ్ ఫోన్స్, దాదాపు ముప్పయివేలకుపైగా (50 డాలర్లు) విలువచేసే వోచర్ ను అదనంగా అందించనుంది. అలాగే ఒక సంవ్సతరంలోపు మొబైల్ స్క్రీన్ పాడైతే..దీన్ని ఒకసారి పూర్తి ఉచితంగా రీప్లేస్ మెంటు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
మరోవైపు గెలాక్సీ నోట్ 7 ప్రమాదాల నేపథ్యంలో తమ ఆదాయంపై ఎనలిస్టుల అంచనాలను సంస్థ మరో ప్ర త్యేక ప్రకటనలో తప్పుబట్టింది. ఈ అంచనాలకు భిన్నంగా ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయి అమ్మకాలతో లీడ్ లో ఉన్నట్టు ఒక ప్రకటనలో వివరించింది. కాగా గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ రీకాల్, శాశ్వత ఉపసంహరణ తదితర పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ ప్రాఫిట్ అంచనాల్లో కోత పెట్టుకుంది. గెలాక్సీ నోట్ 7 నష్టాలతో రాబోయే రెండు క్వార్టర్స్ లాభాలు తగ్గుతాయని అంచనా వేసిన సంగతి తెలిసిందే.