ధోనీ లక్ష్యంగా క్రికెటర్ పదునైన చురకలు!
క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ, గౌతం గంభీర్ ఇద్దరు సమకాలీనులు. ఒకప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి పోటాపోటీగా ఆడినవారు. ఆ తర్వాత ధోనీ క్రమంగా కెప్టెన్ భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిపోగా.. గంభీర్ అంచెలంచెలుగా జట్టుకు దూరమై, ఇటు ఐపీఎల్‌లోనూ రాణించలేక చతికిలపడ్డాడు.
ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. గంభీర్ తాజాగా పెట్టిన ఓ పోస్టు మాత్రం ఆన్‌లైన్‌లో పెద్ద యుద్ధానికే దారితీసింది. జీవిత కథలు ఆధారంగా వచ్చే సినిమాల (బయోపిక్)పై ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యతో ఉన్న తన ఫొటోను గంభీర్ ట్వీట్ చేశాడు. ’క్రికెటర్ల జీవిత చరిత్రల మీద వచ్చే సినిమాలను నేను నమ్మను. నిజానికి క్రికెటర్ల కన్నా దేశానికి ఎక్కువ సేవ చేసినవారిపైనే ఇలాంటి సినిమాలు తీయాలి. దేశం కోసం ఎన్నో మంచి పనులు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి గురించే బయోపిక్‌లు తీయాలి' అంటూ గంభీర్ పేర్కొన్నాడు.
ధోనీ జీవిత కథ ఆధారంగా త్వరలోనే 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ధోనీ సినిమాను చులకన చేసేందుకు గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడంటూ ట్విట్టర్‌లో ధోనీ ఫ్యాన్ ఫైర్ అయ్యారు. అతనిపై విమర్శల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. అయినా వెనుకకు తగ్గని గంభీర్.. తాజా యూరి ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ.. క్రికెటర్ల కన్నా అమరులపై బయోపిక్‌లు తీయడం మంచిదని, దేశం కోసం ఓ యువకుడు చేసిన ప్రాణత్యాగం కంటే గొప్ప స్ఫూర్తి ఏముంటుందంటూ గంభీర్ పేర్కొన్నాడు. దీంతో రెచ్చిపోయిన ధోనీ ఫ్యాన్స్ తమదైన స్టైల్‌లో గంభీర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
— Gautam Gambhir (@GautamGambhir) September 18, 2016