12 గంటల పాటు శాంతి
గాజా/జెరూసలేం: నిత్యం క్షిపణులు, బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పాలస్తీనాలోని గాజా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలలో శనివారం తాత్కాలికంగా శాంతి నెలకొంది. శిథిలాల కింద ఉన్న మృతదేహాల గుర్తింపునకు వీలుగా పోరుకు తాత్కాలిక ంగా విరామం పలకాలని ఐక్యరాజ్య సమితి చేసిన అభ్యర్థనకు హమాస్ (ఉగ్రవాద సంస్థ), ఇజ్రాయెల్ అంగీకరించాయి. దీంతో 12 గంటల పాటు మానవతావాద సంధి స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. అయితే, ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ కోసం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ, ఖతార్ విదేశాంగ మంత్రులు తమ ప్రయత్నాలు శనివారం కూడా కొనసాగించారు. వీరు పారిస్‌లో సమావేశమై చర్చలు జరిపారు.
మానవతావాద సంధిని 24 గంటల పాటు కొనసాగించాలని తాము ఇరువైపుల పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని సమావేశం అనంతరం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియెస్ మీడియాకు చెప్పారు. దాన్ని తర్వాత కూడా కొనసాగించవచ్చన్నారు. అయితే, దీర్ఘకాలిక కాల్పుల విరమణకు తాము అంగీకరించబోమని హమాస్ స్పష్టం చేసింది. మరోవైపు, శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీసి వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 19 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య 1000 దాటింది.