
జడ్జి కట్నదాహం.. కోట్లిచ్చినా భార్యకు హింసలు!
పెళ్లి సమయంలో 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలాసవంతమైన గృహోపకరణాలు, రెండు ఖరీదైన కార్లు కట్నంగా తీసుక్నునాడు. అయినా అతని కట్నం దాహం తీరలేదు. మరింత కట్నం కోసం భార్యను వేధించాడు. ఇది సంచలనం సృష్టించిన గీతాంజలి ‘కట్నం హత్య’ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఇది. 2013లో హర్యానా పంచకులకు చెందిన గీతాంజలి అనుమానాస్పదంగా మృతి చెందింది. జడ్జిగా పనిచేస్తున్న భర్త రణ్వీత్ గార్గ్ క్రూరంగా కట్నం కోసం హింసించడంతోనే గీతాంజలి చనిపోయినట్టు సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కేసులో గార్గ్‌తోపాటు అతని తండ్రి, మాజీ సెషన్స్ జడ్జి కేకే గార్గ్, అతని తల్లి రచన గార్గ్ లపై డౌరీ డేత్ (కట్నం మృతి), క్రూరంగా ప్రవర్తించడం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. జడ్జి పోస్టు నుంచి సస్పెండైన రణ్వీత్ గార్గ్ ప్రస్తుతం అరెస్టవ్వగా.. అతని తల్లిదండ్రులు ముందస్తు బెయిల్‌పై బయట ఉన్నారు.
సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం 2007లో గీతాంజలి-గార్గ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో గార్గ్‌కు కట్నం కింద 51 లక్షలు, 101 బంగారు నాణెలు, విలావసంతమైన గృహోపకరాణలు, స్కోడా కారు ఇచ్చారు. 2008లో రూ. 21.6 లక్షలు విలువచేసే మరో స్కోడా సూపర్బ్ కారును కానుకగా ఇచ్చారు. 2011లో గార్గ్ తల్లిదండ్రుల ఒత్తిడితో గీతాంజలి తల్లిదండ్రులు మరో 16.3 లక్షల ప్లాట్‌ను సోనెపట్‌లో కొనిచ్చారు. అయినా, గార్గ్ కట్నం దాహం చల్లారలేదని, పంచకుల సెక్టర్ 25లో రూ. 50 లక్షలు ఇల్లు కొనివ్వాలని నిత్యం గీతాంజలిని వేధించాడని, చివరకు 2013 మేలో తనకు గుర్గావ్‌లో పోస్టింగ్ రావడంతో పిల్లల స్కూల్ ఆడ్మిషన్ కోసం రూ. 2.2 లక్షలు తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని గీతాంజలిపై గార్గ్ ఒత్తిడి చేశాడని, దీంతో తన మృతికి ముందు గీతాంజలి ఎంతో మానసిక క్షోభ అనుభవించిందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.