ట్రంప్ వైఫ్యలం తప్పదు..మార్కెట్ల కల కల్లే..
ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంటే.. మరోపక్క కోటీశ్వరుడు, పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ మాత్రం ట్రంప్ విఫలం కావడం తధ్యమని జోస్యం చెప్పారు. అంతేకాదు మార్కెట్ల కల ఇక ముగిసినట్టే నని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ చేపటనున్న విధానాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అనిశ్చితి కొనసాగనుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ అభిప్రాయపడ్డారు.
స్విట్జర్లాండ్ లోని దావూస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశంలో బ్లూమ్ బర్గ్ తో మాట్లాడిన సోరస్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ల అనిశ్చితి పీక్ స్టేజ్ లోఉందన్నారు. ఇకముందు మార్కెట్టు మరింత తడబాటుకు గురవుతాయని, ఇంతకంటే బావుంటాయని తాను భావించడంలేదన్నారు. మొత్తంమీద ట్రంప్ విఫలం కానున్నాడని తాను వ్యక్తిగతంగా విశ్వశిస్తున్నానన్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించనున్నాడనే దాన్ని అంచనావేయడం కష్టమని పేర్కొన్నారు.
అమెరికా వాస్తవ ఆర్థిక వ్యవస్థ మరింత ఆర్థిక మాంద్యంలోకి కూరుకు పోనున్నదని సొరోస్ హెచ్చరించారు. ఇతర దేశాల ప్రజలు.. చైనీయులు, చమురు ఉత్పత్తి దేశాల ప్రజలు డాలర్ నిల్వలను పోగేసుకున్నారని, ఈ సంక్షోభ కాలంలో వీటిని వాస్తవ సంపదలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని సోరోస్ చెప్పారు. కాబట్టే ఈ దేశాలు ఇప్పుడు సంపన్నదేశాలుగా మారుతుండడతో, అమెరికన్లకు మరింత రుణాభారం మీదపడుతోందని పేర్కొన్నారు. ఇంధనం, భూతాపం, ఇంధన పరాధీనతకు సంబంధించిన సమస్యలపై తలపడేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు అవసరమని సోరోస్ పేర్కొన్నారు. ఆర్థికవృద్ధిలో చైనా దూసుకుపోతుందన్నారు. నవంబర్ 8 ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా లాభపడిన సంగతి విదితమే.
అలాగే బ్రిటన్ ప్రధాని థెరిసా మే పదవిలో కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మే మంగళవారం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమణ చర్చలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, బ్రెగ్జిట్ పరిణామాలు రెండు వైపులా ప్రభావితం చేయనున్నాని చెప్పారు.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్ కి జార్జ్ సోరోస్ సుమారు13 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.86 కోట్లు) విరాళం ప్రకటించారు. వైట్‌హౌస్‌లోకి రిపబ్లికన్‌నేత ఎవరూ రావడానికి వీల్లదేని ఆయన తెగేసి చెప్పారు. వలసవాదానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా తీవ్రమైన విధానాన్ని వారు ఎంచుకున్నారంటూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌ల ప్రచార తీరుతెన్నులపై అప్పట్లో మండిపడిన సంగతి తెలిసిందే.