
సూర్యుడికే కళ్లు చెదిరే కాంతి!
కాలుష్యం తగ్గాలి. భూమి పచ్చగా ఉండాలి. ఇలా కోరుకోని వారెవరూ ఉండరుగానీ.. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా... కాలుష్యాన్ని పెంచేస్తున్న పెట్రోలు, డీజిళ్లకు సరైన ప్రత్యామ్నాయం దొరకాలి. ఇదిగో... పక్క ఫొటోల్లో కనిపిస్తున్న సెటప్ అంతా అందు కోసమే! అర్థం కావడం లేదా? కొంచెం సింపుల్‌గా అర్థంచేసుకునేందుకు ప్రయత్నిద్దాం. విశ్వం మొత్తమ్మీద అత్యంత విస్తారంగా లభించే హైడ్రోజన్ గురించి మీరు వినే ఉంటారు.
రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్‌తో కలసి నీరవుతుందనీ మీకు తెలుసు. అయితే ఈ వాయువు అత్యంత సమర్థమైన ఇంధనమని... కాలుష్యం కూడా దాదాపు ఉండదని కొద్దిమందికే తెలుసు. అందుకే కొంచెం కష్టమైనప్పటికీ ఉపగ్రహ ప్రయోగాల్లో హైడ్రోజన్‌నే ఇంధనంగా వాడుతూంటారు. ఇప్పుడు ఫొటోల విషయానికి వద్దాం.
పెళ్లిళ్లు, బహిరంగ సమావేశాల్లో ఇలాంటి ఫోకస్ లైట్లు వాడటం మీరు చూసే ఉంటారు. జర్మన్ అంతరిక్ష కేంద్రం ఇలాంటి 149 జినాన్ లైట్లను ఒక్కదగ్గర ఏర్పాటు చేసింది. ఒక్కో లైట్ సామర్థ్యం దాదాపు ఏడు కిలోవాట్లు. వీటన్నింటినీ ఒక్కసారి ఆన్ చేస్తే పుట్టే వెలుగు తాలూకూ శక్తి ఎంతుంటుందో తెలుసా? భూమిని తాకే సూర్యుడి శక్తికంటే పదివేల రెట్లు ఎక్కువ! పుట్టే వేడి కూడా దాదాపు మూడు వేల డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఈ వెలుతురును కేవలం 20 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణమున్న ప్రాంతంపైకి కేంద్రీకరించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి.
ఇంకోలా చెప్పాలంటే భూమ్మీద మరో సూర్యుడిని సృష్టించారన్నమాట! ఇదంతా ఎందుకూ అంటే.. శుద్ధమైన ఇంధనం హైడ్రోజన్‌ను సులువుగా తయారు చేసే పద్ధతులను తెలుసుకునేందుకే అంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యరశ్మిని నీటిపై ప్రసరింప చేసి హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ ప్రయోగాల ద్వారా పరిష్కరిస్తామని అంటున్నారు. ఆ ఇబ్బందులను తొలగిస్తే ఎంచక్కా హైడ్రోజన్‌ను ధారాళంగా వినియోగించుకుని కాలుష్యాలను తగ్గించుకోవచ్చు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్