సోనియాపై వ్యాఖ్యలకు గిరిరాజ్ క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాపై అవమానకర వ్యాఖ్య లు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. ‘నేను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. అయినా నా వ్యాఖ్యలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నా’ అని పేర్కొన్నారు. అంతకుముందు సోనియా చర్మం రంగుపై గిరిరాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సభ దద్దరిల్లింది. కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింపజేశారు. ఆయన మాటలు స్త్రీజాతికే అవమానమని, తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని నినాదాలు చేశారు.
కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కూడా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్.. దీనిపై స్పందించాల్సిందిగా మంత్రికి సూచించారు. మంత్రి వ్యాఖ్యలు తననూ బాధించాయని, అలా మాట్లాడాల్సింది కాదని పేర్కొన్నారు. దీంతో మంత్రి పశ్చాత్తాపం ప్రకటించారు. రాజీవ్‌గాంధీ సోనియాను కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడినట్లయితే, సోనియా చర్మం తెల్లగా కాకుండా నల్ల రంగులో ఉన్నట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకతాన్ని ఆమోదించేదా అంటూ గిరిరాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.