రాజస్థాన్లో ఘోరం జరిగింది. ముగ్గురు విద్యార్థులు తమతో కలిసి చదువుకుంటున్న ఓ విద్యార్థినికి కూల్డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమెపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు.
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యం
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థినికి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ముగ్గురు తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భరత్‌పూర్‌కు చెందిన బాధితురాలు ప్రతాప్‌నగర్‌లోని ఓ కళాశాలలో వైద్యవిద్య అభ్యసిస్తోంది. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఈ నెల మొదట్లో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాల మేరకు సంగనీర్ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విజయ్‌కుమార్, యోగేంద్రకుమార్, వీరేంద్రకుమార్‌లను నిందితులుగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాగా, నిందితుల్లో ఒకరితో యువతి సహజీవనం చేస్తోందని, అతను ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు చెపుతున్నారు. అతను పెళ్లికి నిరాకరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించినట్టుగా భావిస్తున్నారు.