స్నేహితురాలిని హత్య చేసి పూజలు
స్నేహితురాలిని హత్య చేసి పాతిపెట్టిన స్థలంలోనే ప్రేతాత్మకు భయపడి పూజలు చేసిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాగై జిల్లా ఉత్తరపు పొయ్‌గై నల్లూర్ కరైకులంలో ఉన్న ఖాళీ మైదానంలో 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున పువ్వులు, అగరవత్తులు, గాజు, రిబ్బన్ తదితరాలను అక్కడ ఉంచి పూజలు చేసి ఉండడం అక్కడి వారికి అనుమానం కలిగింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న వేలాంకన్ని పోలీసులు అక్కడికి వెళ్లి పూజలు చేసి ఉన్న స్థలంలో మట్టిని తవ్వి చూడగా అక్కడ ఓ యువతి శవం బయట పడింది.
విచారణలో హతురాలు నాగై అక్కరై పేట దిడీర్ కుప్పానికి చెందిన జాలరి సింగారవేలు - దైవయానై దంపతుల కుమార్తె సూర్య అని తెలిసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అదే ప్రాంతానికి చెందిన ఆమె స్నేహితుడు జ్ఞానవేల్ (23), అతని మిత్రుడు దీపన్‌రాజ్ (23) సింగ శశికుమార్ (19) మరో 17 ఏళ్ల యువకులు ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో ఐదుగురు సూర్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. విచారణలో జ్ఞానవేలు, సూర్యను ప్రేమించాడు. గత సంవత్సరం సూర్య గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. ఆ తరువాత వీరిద్దరి ప్రేమకు సూర్య తల్లిదండ్రులు అడ్డుచెప్పారు.
సూర్య గర్భిణి అయిన సంగతి బయట తెలియడంతో ఆమెను అందరూ తక్కువగా చూశారు. జ్ఞానశేఖర్‌కు చెడ్డ పేరు రావడంతో స్నేహితురాలిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గత నెల 30వ తేదీ సూర్యను జ్ఞానవేల్ కలుసుకుని ఆమెను సమీపంలో ఉన్న మనోన్‌మణి ఆలయం వద్దకు రప్పించాడు. అక్కడ బైకులో సిద్ధంగా ఉన్న జ్ఞానవేల్, అతని మిత్రులు దీపన్ రాజ్‌ల సహాయంతో సూర్యను బైకులో సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లారు.
కారైకులం వద్ద బైకును స్నేహితునికి ఇచ్చి సూర్య, జ్ఞానవేల్ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్నేహితులు నలుగురు సూర్య, జ్ఞానవేల్ ఉన్న స్థలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో నలుగురు ఆమెపై దాడి చేశారు. జ్ఞానవేల్ బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తరువాత రెండు అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వి పాతిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ప్రేతాత్మకు భయపడి జ్ఞానవేల్ పూజలు చేసినట్టు విచారణలో తెలిసింది.