పసిడి దిగుమతులు 41% డౌన్!
న్యూఢిల్లీ: దేశం పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 41 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వరంగ ఎంఎంటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డీఎస్ దేశీ అంచనా వేశారు. ప్రభుత్వ ఆంక్షలు దీనికి కారణమని బుధవారం పేర్కొన్నారు. సుంకాల పెంపు కారణంగా దేశీయంగా భారీగా ఉన్న రేట్లు సైతం బంగారం డిమాండ్ పడిపోవడానికి కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా వేశారు. దేశీయ వినిమయం కోసం బంగారం దిగుమతులను తమ సంస్థ తగ్గించుకుంటోందని ఆయన వివరించారు. అయితే ఆభరణాలు ఎగుమతి చేసే ప్రత్యేక యూనిట్లకు మాత్రం సరఫరాలను పెంచుతున్నట్లు వెల్లడించారు.
నియంత్రణలు సరిపోతాయి...
దిగుమతులకు సంబంధించి ప్రస్తుత నియంత్రణలు సరిపోతాయని అన్నారు. మరిన్ని నియంత్రణలు అవసరం లేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి బంగారం దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకూ కేంద్రం పెంచింది. నాణేలు, కడ్డీల దిగుమతులను నిషేధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. విదేశీ మారకంతో రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణమైన క్యాడ్ 2012-13 జీడీపీలో 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.7 శాతానికి (దాదాపు 60 బిలియన్ డాలర్ల)కు తగ్గుతుందన్నది ఆర్థికశాఖ తాజా అంచనా.