
పసిడిపై ‘ఫెడ్ ఎఫెక్ట్’!
మిశ్రమ ధోరణిలో కొనసాగుతుందని నిపుణుల వ్యాఖ్య
న్యూయార్క్: పసిడి ధరలపై సమీప రోజుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వారంలో పసిడి కదలికలు మిశ్రమ ధోరణిలో కదలాడే వీలుందని వారు అంటున్నారు. డిసెంబర్ 15,16 తేదీల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుతం జీరో స్థాయిలో ఉన్న వడ్డీరేట్ల పెంపు అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక గడచిన వారంలోనూ ... అంతర్జాతీయ కమోడిటీ ప్యూచర్స్ మార్కెట్ నెమైక్స్ పసిడి నష్టాన్నే చవిచూసింది. ఔన్స్ (31.1 గ్రా) 0.8 శాతం నష్టంతో 1,076 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,062 డాలర్లకు సైతం భారీగా పడిపోయింది. తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడింగ్ చివరకు కొంత కోలుకుంది. అంతక్రితం వారం ముగింపు 1,084 డాలర్లు. ఫెడ్ రేటు పెంచితే హోల్డింగ్స్ వ్యయాల భారం వల్ల ఇన్వెస్టర్లు భారీగా పసిడి విక్రయాలు జరపవచ్చని అంచనా.
దేశీయంగా 8వ వారం లాభం...
గడచిన వారమంతా పసిడి ధరలు తీవ్ర ఒడిదుకులతో సాగాయి. అయితే ఏడు వారాల తరువాత మొట్టమొదటిసారి... స్వల్ప లాభంతో బయటపడ్డం గమనార్హం. అంతర్జాతీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గినా, రూపాయి మారకపు విలువ క్షీణించడంతో దేశీయంగా స్వల్ప పెరుగుదల కనపర్చింది. రూపాయి పతనంతో దిగుమతుల వ్యయంలో పెరుగుదల, పెళ్లిళ్ల సీజన్‌కు సంబంధించి ఆభరణాల వర్తకులు, రిటైలర్ల నుంచి డిమాండ్ వంటి కారణాలు పసిడి ధర దాదాపు స్థిరంగా ఉండడానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ముంబై స్పాట్ బులియన్ మార్కెట్‌లో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల పసిడి విలువ 4వ తేదీ శుక్రవారం ధర రూ.25,140. అయితే 11వ తేదీ శుక్రవారం నాడు ఈ ధర రూ. 25,230 వద్ద ముగిసింది. స్వల్పంగా రూ.90 లాభపడింది. ఇక 99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం లాభపడి 25,380 వద్ద ముగిసింది.