
ఆ గొలుసు బయటకొచ్చింది
‘ఎనిమా’ ఇచ్చి రప్పించిన వైద్యులు
* ఊపిరి పీల్చుకున్న పోలీసులు
హైదరాబాద్: వైద్యుల ‘ఎనిమా’ చికిత్స... పోలీసుల డబ్బా చిట్కా పని చేసింది.. దొంగ మింగిన బంగారు గొలుసు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. నిందితుడి కడుపులో ఉన్న గొలుసు బయటపడటంతో ఐదు రోజులుగా హైరానా పడుతున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్‌కు చెందిన వికాస్ (22) ఈనెల 15 వ తేదీ రాత్రి చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల మెడ నుంచి బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పరారయ్యాడు. అయితే పోలీ సులు వెంటపడటంతో గొలుసును మింగేశాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ ఎక్స్‌రే తీయించగా నిందితుడి కడుపు దిగువ భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసును బయటకు తీయాలని పోలీసులు కోరగా, వైద్యులు నిరాకరించారు. శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకు ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా బయటకు వస్తుందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు చెప్పుకోలేని కష్టాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఈ నెల 18 న ‘గొలుసు రికవరీకి దారేది..?’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే.
ఫలించిన పోలీసుల డబ్బా చిట్కా...
నిందితుడు వికాస్ కడుపులోని గొలుసును బయటకు రప్పించేందుకు వైద్యులు ఎనిమా (ద్రావకం, మందులు ఇచ్చి కడుపును శుభ్రం చేయడం) ఇచ్చారు. నిందితుడు మలవిసర్జనకు వెళ్లినప్పుడు లెట్రిన్ కుండీ గుండా గొలుసు పోయే అవకాశం ఉంది. దీంతో పోలీసులు డబ్బా చిట్కాను ఉపయోగించారు. నిందితునికి ఓ డబ్బా ఇచ్చి అందులోనే మలవిసర్జన చేసి, అనంతరం గొలుసు ఉందా లేదా అనేది వెతకాలని చెప్పారు.
రోజూ రెండు పూటల ఎక్స్‌రే తీయించి గొలుసు కడుపులో ఎక్కడ ఉందో పరిశీలించారు. బుధవారం ఉదయం తీసిన ఎక్స్‌రేలో కడుపులో ఉన్న గొలుసు పెద్ద పేగులోకి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. మరోమారు ఎనిమా ఇవ్వడంతో మలవిసర్జన సమయంలో గొలుసు డబ్బాలో పడింది. శుభ్రం చేసిన ఆ గొలుసును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.