మళ్లీ 31 వేల పైకి పుత్తడి..
మళ్లీ 31 వేల పైకి పుత్తడి..
Published Sat, Aug 17 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
న్యూఢిల్లీ: శ్రావణ మాసం ప్రారంభం బంగారానికి మళ్లీ మెరుపులద్దుతోంది. రెండుమూడు నెలల క్రితం వన్నె కోల్పోయిన పసిడి ఇటీవల మళ్లీ ‘ధర’ధగలాడుతోంది. ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి పతనం కూడా జత కలుస్తోంది. వెరసి ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం(99.9%) ధర రూ. 31,000ను తాకింది. గత రెండేళ్లలో లేనివిధంగా ఒక్కరోజులోనే ఏకంగా రూ. 1,310 ఎగసింది. ఇంతక్రితం 2011 ఆగస్ట్ 19న మాత్రమే బంగారం ఈ స్థాయిలో లాభపడింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉన్న ధర కాగా, కోల్‌కతాలో మరింత అధికంగా రూ. 31,160కు చేరడం విశేషం! అక్కడ 10 గ్రాముల ధర రూ. 1,195 పెరిగింది. ఇక మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ రూ. 1,050 జంప్‌చేసి రూ. 31,050 వద్ద ముగిసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్టాకిస్టుల నుంచి డి మాండ్ జోరందుకున్నదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చెన్నైలో 1,115 పుంజుకుని రూ. 30,810ను తాకగా, ముంబైలో కూడా 10 గ్రాముల ధర రూ. 1,155 ఎగసి రూ. 30,830కు చేరింది. లెసైన్స్ లేకుండా దిగుమతి చేసుకునే బంగారు నాణేలు, పతకాలు(మెడలియన్స్) తదితరాలపై గురువారం రిజర్వ్ బ్యాంకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కాగా, రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల క్షీణత వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులను పసిడిలోకి మళ్లిస్తున్నారని ఆల్ ఇండియా సరఫా బజార్ వైస్‌ప్రెసిడెంట్ సురేందర్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడానికితోడు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పుంజుకోవడంతో దేశీయంగా బంగారంలో ర్యాలీకి అవకాశం చిక్కిందని ట్రేడర్లు వ్యాఖ్యానించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా బులియన్ మార్కెట్లకు సెలవు కావడంతోనూ ధర ఒక్కసారిగా ఊపందుకున్నదన్నారు.
వెండి మెరుపులు
పసిడి బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పురోగమించాయి. ముంబై మార్కెట్లో ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయిలో కేజీకి రూ. 2,970 ఎగసి రూ. 49,980ను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా, హైదరాబాద్‌లో అయితే మరింత అధికంగా కేజీ వెండి ధర రూ. 3,500 పెరిగి రూ. 50,000కు చేరింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. రూపాయి క్షీణత కట్టడికి ప్రభుత్వం, ఆర్‌బీఐలు బంగారం దిగుమతులపై ఆంక్షలను విధిస్తూ వచ్చాయి. వీటికి జతగా పెట్టుబడులపై సైతం నియంత్రణలు విధించే అవకాశమున్నట్లు మార్కెట్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు 4% పతనంకాగా, రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి 62కు పడిపోవడం గమనార్హం.
రెండు నెలల గరిష్టం
అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు లాభపడ్డాయి. గురు, శుక్ర వారాల్లో ఔన్స్(31.1 గ్రాములు) ధర లండన్ మెటల్ ఎక్స్ఛేంజీలో దాదాపు 40 డాలర్లమేర పుంజుకుని 1369 డాలర్లకు చేరుకున్నాయి. ఒక దశలో 1373 డాలర్లను సైతం తాకాయి. ఇవి రెండు నెలల గరిష్టంకాగా, శుక్రవారం వరకూ వారం మొత్తంమీద 4% బలపడ్డాయి. వెండి ధరలు కూడా వారం మొత్తంమీద 12% జంప్‌చేసి ఔన్స్‌కు 23 డాలర్లకు చేరాయి. గోల్డ్‌కు చైనా నుంచి కనిపిస్తున్న డిమాండ్‌కుతోడు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించడం మొదలుపెడుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను పసిడి కొనుగోళ్లవైపు మళ్లించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement