దేశముదురు... ఆటకట్టు
చైనాలోని చోంగ్‌క్వింగ్ నగరానికి చెందిన లియూ షియాంగ్ అనే దేశముదురు అతితెలివి చూపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనికి 7.22 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.76 కోట్లు) లాటరీ తగిలింది. ఎవరైనా ఏం చేస్తారు... వెంటనే విషయాన్ని కుటుంబీకులతో పంచుకుంటారు. అయితే లియూ బుర్రలో ఓ వెధవ ఆలోచన వచ్చింది. లాటరీ తలిగిన విషయాన్ని దాచిపెట్టి... భార్య యువాన్ లీని వెంటనే విడాకులు ఇవ్వాలని కోరాడు. ఇద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న అప్పును తానే భరిస్తానని... విడాకులు ఇవ్వమని బలవంతం చేశాడు. మరో దారిలేక ఆమె అలాగే చేసింది.
అధికారికంగా విడాకులు మంజూరైన మరుసటి రోజే లియూ వెళ్లి లాటరీ మొత్తాన్ని క్లెయిమ్ చేశాడు. వీరి విడాకుల విషయం తెలియని స్నేహితులు యువాన్ లీని శుభాకాంక్షలు చెప్పసాగారు. అంత డబ్బు వచ్చింది కదా... కంగ్రాట్స్ అంటూ జనం ఫోన్లు చేస్తుంటే ఆమె బిత్తరపోయింది. చివరికి విషయం తెలిసి భర్తపై కోర్టులో కేసు వేసింది. తామిద్దరం దంపతులుగా ఉన్నపుడే లాటరీ టిక్కెట్టు కొన్నాడని... అందువల్ల ప్రైజ్‌మనీలో తనకు సగభాగం రావాల్సిందేనని వాదించింది. చివరకు కోర్టు ఆమె వాదనతో ఏకీభవించి 1,8 లక్షల డాలర్లను (కోటీ 19 లక్షల రూపాయలు) మాజీ భార్యకు ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చి... లియూ ఆటకట్టించింది.