రింగ్ రోడ్డు మీద రెండు లక్షలు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాసుల వర్షం కురుస్తోంది! ఒకటి కాదు రెండు కాదు రోజుకు రూ. 31,328.. వారంలో రూ. 2,19,300 .. రెండున్నర నెలల్లో రూ. 21,38,600.. ఇంతకీ ఈ మొత్తం ఎవరికి చేరుతుందో తెలుసా? ప్రభుత్వానికి! అవునుమరి.. ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వాహనదారులు చెల్లిస్తున్న అపరాధ రుసుములు.. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది!
మార్చి 7 నుంచి 13 వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై 266 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిలో 78 రాంగ్ పార్కింగ్, 188 రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులున్నాయి. ఇవేకాకుండా ఫైన్ల రూపంలో పోలీసులు రూ. 2,19,300 వసూలు చేశారు. 2015, జనవరి1 నుంచి మార్చి 13 వరకు 2, 643 కేసులు నమోదుకాగా, రూ.21,38,600 అపరాధ రుసుము వసూలయింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై నిబంధనల అతిక్రమణను నిరోధించేందుకు గత ఏడాది జనవరి నుంచి ప్రత్యేక పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాలుగు పెట్రోలింగ్ వాహనాలు నిత్యం పహారా కాస్తూ నేరాల నిరోధానికి ప్రయత్నిస్తుంటాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై అమలులో ఉన్న ట్రాఫిక్ రూల్స్ తెల్సుకోవడంతోపాటు ఫిర్యాదులు, సలహాల కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక హెల్ప్లైన్స్ (040-2300 2424 లేదా 8500411111) ఏర్పాటు చేశారు.