ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు
విజయవాడ, గుంటూరు, నూజివీడులో ఏర్పాటు
ఉద్యోగులు, అధికారులకు వసతి సౌకర్యాలు
హరిత హోటల్‌లో మంత్రులకు సూట్లు
తిలోత్తమ హోటల్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లకు వసతి
త్వరలో అద్దెలు పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉద్యోగుల తరలింపులో భాగంగా శాఖల కార్యాలయాలను ప్రైవేట్ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వసతుల గుర్తింపునకు ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి తాజాగా ప్రజంటేషన్ ఇచ్చింది. విజయవాడ, గుంటూరు, నూజివీడులో శాఖల కార్యాలయాలకు ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. ఈ వివరాలను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రైవేట్ భవనాల అద్దెలను సవరించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అద్దెలు తక్కువగా ఉన్నాయని, వీటిని త్వరలోనే పెంచనున్నట్లు తెలిపారు.
భవానీపురంలోని హరిత హోటల్‌లో 25 సూట్ల(విలాసవంతమైన గదులు)ను మంత్రులకు కేటాయించనున్నారు. అలాగే విజయవాడలోని తిలోత్తమ హోటల్‌లో 53 గదులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయిస్తారు. ప్రైవేట్ భవనాలను ఏకపక్షంగా అద్దెకు తీసుకోరాదని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. భవనాలను అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రైవేట్ భవనాల అద్దెలను యజమానులకు ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ధారించాలని కమిటీ సూచించింది.
కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల వసతి వివరాలు...
►గన్నవరం మేధా టవర్స్‌లోని నాలుగు అంతస్తుల్లో 1,40,000 చదరపు అడుగుల వసతి. మేధా టవర్స్‌ను ఎస్‌ఈజెడ్(సెజ్) పరిధి నుంచి డీనోటిఫై చేయాలి.
► విజయవాడ సబ్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గోకరాజు రంగరాజుకు చెందిన ఆరు అంతస్తుల భవనంలో 2,36,264 చదరపు అడుగుల వసతి
► గన్నవరం జాతీయ రహదారి సమీపంలోని గెస్ట్‌హౌస్‌లో 2,500 చదరపు అడుగులు
►ఐఐఐటీ-నూజివీడులో 144 గదుల్లో 1,14,048 చదరపు అడుగుల వసతి
► ఎస్టీ బాలుర హాస్టల్‌లో 13 గదుల్లో 5,184 చదరపు అడుగుల వసతి
► కుష్టు వ్యాధి ఆసుపత్రి ఐదు భవనాల్లో 18,738 చదరపు అడుగుల వసతి
► ఒక్కో ఉద్యోగికి 100 చదరపు అడుగుల చొప్పున వసతి అవసరం
►ఉద్యోగుల నివాసాల కోసం 1.5 కోట్ల చదరపు అడుగుల వసతి అవసరం.