విద్యార్థులతో చెలగాటం
పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మూసివేతలు
జిల్లాలో వరుసగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూత
అక్కడి విద్యార్థులు గురుకుల పాఠశాలలకు తరలింపు
ఇదెక్కడి విడ్డూరమంటున్న తల్లిదండ్రులు, విద్యార్థులు
32 హాస్టళ్ల మూసివేత.. తరలింపు మొదలు
బీసీ సంక్షేమంలో చదువుతున్న విద్యార్థుల్లోనూ ఆందోళన
విద్యార్థులు తక్కువ, ప్రైవేటు భవనాల పేరుతో కుదింపుకు నిర్ణయం
మూడు మూతలు..నాలుగు కుదింపులు.. ఆరు కోతలుగా సాగుతోంది సర్కారు పాలన. చెప్పినట్లుగానే పేద, బలహీనవర్గాల విద్యార్థుల వసతిని ఎత్తివేసేందుకే పాలకులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే 32 ఎస్సీ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులను దగ్గర్లోనే ఉన్న రెసిడెన్సియల్ స్కూళ్లకు తరలిస్తామని చెబుతున్నా.. అదంతా సులభంగా లేదు. విద్యార్థులు దాదాపు పది, పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యాక ఇలా ఇబ్బందిపెట్టడం దారుణమని వాపోతున్నారు.
కడప : వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేక స్కూళ్ల పేరుతో హాస్టళ్ల మూసివేతకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో కొన్నింటిని ఎత్తివేస్తూ ఒక్కసారిగా బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. విద్యార్థులకు అన్ని రకాల సంక్షేమాన్ని కల్పిస్తున్నామంటూనే వారిని క్షోభకు గురిచేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మూసివేత అనే పెద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం నింపాదిగా తీసుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హాస్టళ్ల వాతావరణానికి అల వాటుపడిన విద్యార్థులను మరోచోటికి మార్పు చేయడం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లలను చూడాలన్నా, వారు ఇళ్లకు రావాల న్నా కిలోమీటర్ల కొద్దీ వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వేసవి సెలవుల్లో కార్యక్రమానికి శ్రీకా రం చుట్టి అప్పట్లోనే గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానించి ఉంటే బాగుండేదంటున్నారు.
మూతపడనున్న హాస్టళ్లు
జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 132 హాస్టళ్లు నడుస్తుండగా, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పది హాస్టళ్లు, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 60 హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సర్కార్ హాస్టళ్లను కుదించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 32 సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లు మూతపడనున్నాయి. అయితే గిరిజన సంక్షేమశాఖలో 10 హాస్టళ్లు ఉండగా, పులివెందుల బాలికల హాస్టల్, రాజంపేట ఆశ్రమ పాఠశాల మినహా మిగతా వాటిని రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చివేశారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎర్రగుంట్ల మండలంలోని చిలంకూరు, లింగాల మండలంలోని వెలిదండ్ల, కడపలోని పలు హాస్టళ్లను ఇప్పటికే ఎత్తివేశారు. ఎత్తివేసే కార్యక్రమం రెండు రోజులుగా యుద్ధప్రాతిపదికన సాగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో దాదాపుగా నిర్ణయించిన హాస్టళ్లన్నీ మూసివేతకు సిద్ధమయ్యాయి.
విద్యార్థులు తక్కువనే సాకుతో..
ప్రస్తుతం కొనసాగుతున్న సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లలోని కొన్నింటిలో విద్యార్థులు తక్కువ, సొంత భవనాలు లేవనే సాకుచూపి మూసివేస్తున్నారు. అందుకు సంబంధించిన గతేడాది టీడీపీ సర్కార్ విద్యార్థులు తక్కువగా ఉండి సొంత భవనాలు లేని హాస్టళ్ల వివరాలతోపాటు...ఎక్కడెక్కడ మూత వేసేందుకు ఆస్కారం ఉందో తెలుపాలని ఉన్నతాధికారులు కోరినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులు జిల్లాలో 32 హాస్టళ్లలో 31 హాస్టళ్లకు సొంత భవనాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి మూసివేతకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం మూసివేతకు శ్రీకారం చుట్టింది.
గురుకులాలకు విద్యార్థులు
జిల్లాలో ప్రస్తుతం మూసివేస్తున్న హాస్టళ్లలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లింగాల మండలంలోని వెలిదండ్లలో హాస్టల్‌ను మూసివేయడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో కొందరిని గండి గురుకులానికి తరలించగా, ఎగువ క్లాసులు (9, 10 తరగతుల) విద్యార్థులను పులివెందులలోని మరో గురుకులానికి తరలించారు. ఒక్క లింగాలలో నే కాదు, అన్నిచోట్ల కూడా ఇదే పంథానే అనుసరిస్తున్నారు. హాస్టళ్లను మూసివేయడం, అక్కడి వారిని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ రెసిడెన్షియల్ పేరుతో గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. కేవలం ప్రభుత్వం హాస్టళ్లను మూసివేసి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇలా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
బీసీ సంక్షేమంలో ఆందోళన
జిల్లాలో ఒకపక్క ఎస్సీ హాస్టళ్లను ఎత్తివేస్తుండటంతో మరోపక్క బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో కూడా ఆందోళన ప్రారంభమైంది. ఎప్పుడు మూసివేస్తారో, ఏ క్షణాన వెళ్లాల్సి వస్తుందోనని విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. బీసీ సంక్షేమశాఖకు సంబంధించి కూడా దాదాపు 27 హాస్టళ్లకు సొంత భవనాలు లేవని, ఇంతకుమునుపే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన నేపథ్యంలో మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారికి లేనట్లేనని బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా బీసీ సంక్షేమంలో కూడా ఆందోళన నెలకొంది.
మెరుగైన వసతులు కల్పిస్తాం: డీడీ సరస్వతి
జిల్లాలో ప్రస్తుతానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు 32 హాస్టళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి తెలిపారు. అందుకు సంబంధించి మూసివేసిన హాస్టళ్లలోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
జిల్లాలో హాస్టళ్లకు సంబంధించిన వివరాలు
సాంఘిక సంక్షేమశాఖ బాలబాలికల హాస్టళ్ల సంఖ్య 132
అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,600
ప్రస్తుతం మూసివేతకు సిద్దమవుతున్న హాస్టళ్లు 32
అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 885
బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లు 60
చదువుతున్న విద్యార్థుల సంఖ్య 5,160
మూసివేతకు ప్రతిపాదనలు వెళ్లినవి (ప్రైవేటు భవనాల్లో ఉండేవి) 27
జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు 10
అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1,015
నేను వెళ్లను
మాది చిట్వేలి మండలంలోని నాగవరం. ఇక్కడే ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. నన్ను కడపకు వెళ్లమన్నారని అమ్మా, నాన్నకు చెప్పగా వారు వెళ్లొద్దన్నారని తెలిపారు. నేను ఇక్కడే ఉంటాను, లేదంటే ఇంటికి వెళతాను. - ఉప్పటూరు. కళ్యాణి, 7వ తరగతి, నాగవరం
మా పిల్లలు ఇంటి వద్దనే ఉండి చదువుకుంటారు
ఉన్నఫలంగా హాస్టల్ మూసేస్తున్నాం, కడపలో ఉన్న హాస్టల్‌కు పంపమంటే ఎలా సాధ్యం. పిల్లలను దూరంగా ఉంచి చదివించలేం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఇంటి దగ్గరే ఉన్నారు. పెద్ద కుమార్తె శైలజ 6 వ తరగతి, రెండవ కుమార్తె మమత 4వ తరగతి అంబేద్కర్ నగర్‌లోని పాఠశాలలో చదువుకుంటూ హాస్టల్-2 లో ఉంటున్నారు. - చదర్ల.రమాదేవి, అంబేడ్కర్ నగర్, రైల్వేకోడూరు