పడకేసిన ప్రభుత్వ షేర్లు | Government Shares stepped down | Sakshi
Sakshi News home page

పడకేసిన ప్రభుత్వ షేర్లు

Published Fri, Aug 9 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

పడకేసిన ప్రభుత్వ షేర్లు

పడకేసిన ప్రభుత్వ షేర్లు

ముంబై: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లు కుదేలవుతున్నాయి. మార్కెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా కేంద్రం పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయిస్తుండటం... దీనికితోడు వాటివద్దనున్న మిగులు నిధులను ఎలాగైనా ఖజానాకు తరలించే పనిలోపడటం వంటివి ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్నాయి. దీంతో ఈ స్టాక్‌ను ఎడాపెడా అమ్మేసి వదిలించుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో మొత్తం లిస్టెడ్ పీఎస్‌యూల మార్కెట్ విలువలో సుమారు రూ.3.9 లక్షల కోట్లు ఆవిరికావడం దీనికి నిదర్శనం.
 
 బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్స్ క్రాష్...
 కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, ప్రమోట్ చేసిన కంపెనీలకు సంబంధించినవే పీఎస్‌యూ లిస్టెడ్ స్టాక్స్‌లో అత్యధికంగా ఉన్నాయి. ఇటీవలి స్టాక్స్‌క్రాష్‌లో కూడా 98 శాతం ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా బ్యాంకింగ్, చమురు-గ్యాస్, మెటల్, మైనింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు గత కొన్నాళ్లుగా తుక్కుతుక్కు అవుతున్నాయి. మొండిబకాయిల భయంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కుదేలవుతున్నాయి. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం, స్కామ్‌ల ప్రభావంతో మెటల్, మైనింగ్ స్టాక్స్ ఆవిరయ్యేందుకు దారితీస్తోంది.  ఈ రెండునెలల్లో సెన్సెక్స్ 5.5 శాతం, నిఫ్టీ 7.5 శాతం మేర క్షీణించాయి. దీనికికూడా పీఎస్‌యూ షేర్ల పతనమే ప్రధాన కారణం. జూలై ఆరంభంనుంచి మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ క్షీణతలో 90% పీఎస్‌యూలదే కావడం వీటి పతనం ఎలా తీవ్రంగా ఉందనేందుకు నిదర్శనం. కాగా, పీఎస్‌యూల షేర్ల పతనంలో అత్యధికంగా నష్టపోతున్నది ప్రభుత్వమే. జూన్ చివరినాటికి మొత్తం 73 లిస్టెడ్ కేంద్ర పీఎస్‌యూల్లో ప్రభుత్వానికి సగటున 72.3% వాటా ఉంది.
 
 ప్రభుత్వ స్వయంకృతాపరాధమే...!
 పీఎస్‌యూ షేర్లు ఇంత ఘోరంగా కుప్పకూలుతుండటానికి ప్రభుత్వం చేపడుతున్న డిజిన్వెస్ట్‌మెంటే కారణమని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఎలాగైనా నిధులను సమీకరించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒకపక్క, వాటా అమ్మే పీఎస్‌యూల షేరు ధరలు సగానికిపైగా పడిపోయినా... దీనికంటే తక్కువ ధరకే కేంద్రం వాటాను విక్రయిస్తుండటం మొత్తం పీఎస్‌యూ స్టాక్స్‌పై ప్రభావం చూపుతోందని వారు అంటున్నారు.  హిందుస్థాన్ కాపర్ ఇష్యూ ధరతో పోలిస్తే(రూ.160) ఇప్పుడు 63% పైగానే కరిగిపోయి రూ.57కు కుప్పకూలింది. ఇక ఎంఎంటీసీ ఇష్యూకు రెండు నెలల ముందు రూ.300 స్థాయి నుంచి వాటా విక్రయ సమయానికి రూ.70కి పడిపోయింది. అయినాసరే ప్రభుత్వం రూ.60 ధరకు వాటా విక్రయించింది.
 
  ఇప్పుడు ఈ షేరు రూ.45కు జారిపోయింది. మిగులు నిధులతో పుష్టిగాఉన్న కంపెనీల నుంచి డివిడెండ్‌లు ఇతరత్రా మార్గాల్లో సొమ్మును ప్రభుత్వం ఖజానాకు తరలించొచ్చనే భయాలూ పీఎస్‌యూ షేర్లలో అమ్మకానికి పురిగొల్పుతున్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో వాటా విక్రయానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదించడంతో ఆ షేరు ఒక్కరోజే 15 శాతంపైగా కుప్పకూలింది. మరోపక్క, భెల్ షేరూ అదేపనిగా పడుతూవస్తోంది. మూడు రోజుల క్రితం 20 శాతం క్షీణించింది. నెల రోజుల క్రితం రూ.180 స్థాయి నుంచి అడుగంటిపోయింది.
.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement