గోవాలో వాటిపై పూర్తి నిషేధం ..త్వరలో
గోవాలో వాటిపై పూర్తి నిషేధం ..త్వరలో
Published Tue, Apr 11 2017 8:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
పనాజి: గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీచ్‌లకు, బీచ్ పార్టీలకు మారు పేరుగా నిలిచిన గోవాలో అన్ని రకాల మిడ్ నైట్ పార్టీలను, రేవ్ పార్టీలను పూర్తిగా నిషేధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ తరహా పార్టీలకు 80శాతం చెక్ చెప్పిన ప్రభుత్వం పూర్తిగా నిషేధించే వైపు కదులుతోంది. వచ్చే రెండుమూడు వారాల్లో లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలపై పూర్తిగా నిషేధం విధించనున్నట్టు గోవా జలవనరుల మంత్రి వినోద్ పాలేకర్ మంత్రి ప్రకటించారు.
"లేట్ నైట్ పార్టీలు మన సంస్కృతిలో భాగం కాదు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అందుకే వెంటనే మూసివేయాలని" మంత్రి చెప్పారు. గోవా తీరంలో డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రించలేని స్థాయికి చేరిందనీ, అందుకే తక్షణం ఈ పార్టీలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముందు అర్థరాత్రి, రేవ్ పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి విలేకరులతో చెప్పారు. ఈ మేరకు పోలీసుల అధికారులకు ఆదేశాలను అందించినట్టు చెప్పారు. అనేక హెచ్చరికలు, రిమైండర్లు పంపినప్పటికీ, తెల్లవారు జామున 3-4 గంటలవరకు పార్టీలు కొనసాగుతున్నాయని, దీని మూలంగా పెద్దవాళ్లే కాకుండా, బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు.
కాగా వివిధ బీచ్‌లు, అందాలతో లక్షలాది టూరిస్టులను ఆకర్షించే నార్త్ గోవాలోని సియోలిమ్ నియోజకవర్గానికి పాలేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత బీచ్‌లలో గోవా తీరం, పర్యాటక అందాలతో మాదకద్రవ్యాలు, ఇతర మత్తుపదార్థాలు విక్రయం కూడా జోరుగా సాగే తెలిసిందే.
Advertisement
Advertisement