హోదా లేదు.. సాయమే
ఏపీకి హోదాను కేంద్రం విరమించుకుంది: గవర్నర్
⇒ దానికి బదులుగా ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది
⇒ వచ్చే బడ్జెట్ నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర వర్గీకరణ ఉండదు
⇒ విశాఖ సదస్సులో 22.34 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు
⇒వ్యవసాయం 3.69%, మత్స్య పరిశ్రమ 42.57%, పశు సంవర్థక శాఖ 14.91%, ఉద్యానవనం 18.33% చొప్పున వృద్ధి సాధించాయి.
సాక్షి, అమరావతి: కొత్త అసెంబ్లీ.. తాత్కాలికమే అయినా ఒక శుభసందర్భం. కానీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఐదు కోట్ల ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్షకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా దక్కిన ప్రత్యేక హోదా హామీ నెరవేరే అవకాశం లేదని గవర్నర్ నోట చెప్పించింది. ప్రత్యేకహోదాను ఇచ్చే అవకాశం లేదంటూ.. నెపం కేంద్రంపై వేసే ప్రయత్నం చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు రావడం లేదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తేల్చిచెప్పారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదాను కేంద్రం విరమించుకుందని తెలిపారు. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించిందని, వాస్తవానికి పేరులో తేడాయే తప్ప ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు వర్తించే అన్ని అంశాలు ప్రత్యేక సహాయం కింద అందుతాయని అన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అమరా వతిలో నూతనంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీలో సోమవారం తొలిసారి సమావేశమైన ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా ఉదయం 11.06 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన నరసింహన్.. 36 పేజీల ఆంగ్ల ప్రసంగ పాఠాన్ని 50 నిమిషాలలో ముగించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ప్రత్యేక హోదాను ఇచ్చే విధానాన్ని కేంద్రం విరమించుకుందని తెలిపారు. ప్రస్తుతం హోదా కలిగి ఉన్న రాష్ట్రాలు సైతం ఈ నెల చివరి నుంచి ఆ హోదాను కోల్పోనున్నా యని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింద న్నారు. రాష్ట్రంలో చట్టాలను అతిక్రమించి అశాంతిని, అలజడిని సృష్టించే వారిని సహించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు...
► వ్యవసాయం 3.69 శాతం, మత్స్య పరిశ్రమ 42.57 శాతం, పశు సంవర్థక శాఖ 14.91 శాతం, ఉద్యాన వనం 18.33 శాతం చొప్పున వృద్ధి సాధించాయి.
► తోటపల్లి, పోలవరం కుడికాలువ, గండికోట ప్రాజెక్టులను పూర్తి చేశాం. పోలవరం ఎడమ కాలువ, తెలుగుగంగ, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి.
► సుభాష్ పాలేకర్ చెబుతున్న ఖర్చు లేని సహజ సేద్య పద్ధతి అమలు చేస్తాం.
► రుణ విమోచన పథకం కింద ఇప్పటికి రూ.11 వేల కోట్ల చెల్లింపు
► త్వరలో ప్రత్యేక విత్తన చట్టానికి రూపకల్పన
► ప్రతి కుటుంబం రూ.10 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు
► ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా అవకాశాలు
► ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు..
► వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.69 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
► వచ్చే రెండేళ్లలో 10 లక్షల గృహాల నిర్మాణం
► అధికార భాషా సంఘం పేరు తెలుగు భాషా ప్రాధికార సంస్థగా మార్పు
► గర్భిణీ మహిళలకు రూ.6 వేల ప్రోత్సాహకం
► అమరావతి రాజధాని నగరంలో 9 థీమ్ ఆధారిత నగరాల ఏర్పాటు
► వక్ఫ్‌బోర్డు నుంచి ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాల చెల్లిస్తాం.
► పసుపు, కుంకుమ కార్యక్రమం కింద 84 లక్షల స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ. 8,400 కోట్లు చెల్లిస్తాం.
► వచ్చే 14 ఏళ్లు కూడా రాష్ట్రంలో రెండంకెల వృద్ధి కొనసాగేలా చేస్తాం.
► ఇటీవలి విశాఖ భాగస్వామ్య సదస్సులో 22.34 లక్షల మందికి ఉపాధి కల్పించేలా 665 ఒప్పందాలు.
► నిరుద్యోగ యువత ఉపాధి కోసం సమగ్ర యువజన విధానం
► విజయవాడ, విశాఖలకు మెట్రోరైలు
► ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వానికి అవసరమైన భూమి సేకరణ