
పీఎంఓకు కీలక సమాచారం
గవర్నర్ నరసింహన్ గురువారం కూడా ఢిల్లీలో తీరిక లేకుండా గడిపారు. రాష్ట్ర విభజనపై పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులైన రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీతో పాటు ప్రధాని కార్యాలయం ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. కేంద్ర జౌళి మంత్రి కావూరి సాంబశివరావుతోనూ భేటీ అయ్యారు. శుక్రవారం ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, మరికొందరు కేంద్ర వుంత్రులను కలుస్తారని సమాచారం. కేంద్రం పిలుపు మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీ వచ్చిన నరసింహన్, బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, నారాయణస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తదితరులతో భేటీ కావడం, కీలకాంశాలపై నివేదికలివ్వడం తెలిసిందే.
అవే అంశాలను ఆంటోనీ, మొయిలీలకు కూడా ఆయన వివరించారని చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, తాజా రాజకీయ పరిస్థితి, ఉద్యమాల తీరు, ప్రభుత్వం తీరుతెన్నులు, స్తంభించిన పాలన తదితరాలను వారితో పంచుకున్నారని సమాచారం. సీమాంధ్రలో తాజా పరిస్థితి కావూరితో చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్య సమాచారాన్ని పీఎంవో ఉన్నతాధికారులకు గవర్నర్ అందజేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారుు. విభజన కసరత్తులో కేంద్ర హోంశాఖకు పీఎంవో నుంచే ‘రాజకీయ మార్గదర్శనం’ జరుగుతున్నందున వారికి గవర్నర్ ఇచ్చిన సమాచారం, పత్రాలు అత్యంత విలువైనవని ఆ వర్గాలు తెలిపారుు. రాష్ట్రపతికి, కేంద్ర పెద్దలకు గవర్నర్ కీలక నివేదికలిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించవచ్చంటూ హస్తినలో మళ్లీ ప్రచారం మొదలైంది. గవర్నర్ పేర్కొన్న ‘అసాధారణ చర్య’ అదేనని ఉన్నతస్థాయి వర్గాలంటున్నాయి. అయితే ఆ అవసరం లేకుండానే అంతా సజావుగా సాగిపోతుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.