పెద్ద ఉక్కు పరిశ్రమలకు షాక్
న్యూఢిల్లీ: పెద్ద ఉక్కు పరిశ్రమలకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాటి తీవ్రమైన లాబీయింగ్ ను వ్యతిరేకించిన ప్రభుత్వం స్టీల్ కనీస దిగుమతి ధర(ఎంఐపీ)ను మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 66 స్టీల్ అంశాలపై కనీస దిగుమతి ధరను డిసెంబర్ 4 వరకు పొడిగిస్తూ భారత ఉక్కు - కామర్స్ మంత్రిత్వ శాఖ నోటిషికేషన్ జారీ చేసింది. దీంతో దేశీ స్టీల్ పరిశ్రమకు విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి మరికొంతకాలం ఉపశమనం లభించనుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే చౌక ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు ఈ తాజా నిర్ణయం ఉపకరిస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దీనిపై ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సానక్ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. తాము పరిమితిని ఆరు నెలలపాటు పొడిగించాలని కోరినట్టు తెలిపారు. దేశీయ స్టీల్ కంపెనీల కష్టాలు తగ్గడంతోపాటూ, మార్కెట్ మరింత బలోపేతమవుతుందన్నారు. కాగా సుమారు 173 స్టీల్ ప్రొడక్టులకు వర్తించే ఎంఐపీని ప్రభుత్వం తొలుత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రభుత్వం మరోసారి అక్టోబర్ 4వరకూ గడువును పొడిగించింది. తాజా ఎంఐపీ పొడిగింపు 66 ఉత్పత్తులకు వర్తించనుంది. ఐరన్ లేదా నాన్‌అల్లాయ్ స్టీల్ సెమీ ఫినిష్డ్ ఉత్పత్తులు, విభిన్న ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్టుల దిగుమతులపై ఎంఐపీ అమలుకానుంది.