న్యూఢిల్లీ: ఆరు ప్రధాన విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి కాగలదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి కేఎన్ శ్రీవాస్తవ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాలను వచ్చే 2-3 నెలల్లోనే ప్రైవేటీకరించాలని ముందుగా భావించినప్పటికీ.. చెన్నై, లక్నో ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు కొన్ని వారాల పాటు వాయిదాపడటంతో మరింత జాప్యానికి దారితీసింది.
ప్రణాళిక సంఘం సహా సంబంధిత వర్గాలతోను, బిడ్లు వేసే అవకాశం ఉన్న సంస్థలతోను చర్చలు జరుగుతున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రతిపాదనల ఆహ్వాన పత్రం(ఆర్‌ఎఫ్‌క్యూ), ఒప్పందాలు మొదలైన పత్రాలన్నీ తర్వాత దశల్లో ఎలాంటి చట్టపరమైన వివాదాలకు తావులేకుండా పక్కాగా ఉండేలా కసరత్తు జరుగుతోందన్నారు.
ఆసక్తిగా ఉన్న కొన్ని ప్రైవేట్ కంపెనీలు.. విమానాశ్రయాల్లో సిబ్బంది వినియోగం, ఏఏఐకి ఇవ్వాల్సిన వాటాలు తదితర అంశాలపై ఇచ్చిన సూచనల్లో కొన్నింటిని ఆర్‌ఎఫ్‌క్యూలో పొందుపర్చే అవకాశం ఉందని శ్రీవాస్తవ తెలిపారు. జీవీకే, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్, సహారా గ్రూప్, ఫ్రాపోర్ట్ వంటి దిగ్గజాలు ఈ విమానాశ్రయాల ప్రాజెక్టులను దక్కించుకునేందుకు రేసులో ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ఈ ఆరు ఎయిర్‌పోర్టుల మేనేజ్‌మెంట్‌కి సంబంధించి 100% ఈక్విటీ వాటాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ప్రతిపాదనను ఏఏఐ గత నెలలో తెరపైకి తెచ్చింది. బిడ్ దక్కించుకున్న కంపెనీ.. 30 ఏళ్ల పాటు విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి ఏఏఐతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.