30ఏళ్లు నిండితే ఆ పరీక్షలు: ప్రభుత్వం
30ఏళ్లు నిండితే ఆ పరీక్షలు: ప్రభుత్వం
Published Mon, Oct 10 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM
కేన్సర్ వ్యాధిని నివారించేందుకు భారత ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం స్క్రీనింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ కేన్సర్ కింద ప్రభుత్వం కొన్ని సూచనలను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి 30ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ల పరీక్షలను చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
మొదటగా దేశంలో 100 ఎంపికచేసిన జిల్లాల్లో ప్రయోగత్మకంగా కేన్సర్ నివారణ ప్రోగ్రాంను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ఏడాది నవంబర్ లో అగర్తలా నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
తగ్గించడం కంటే నివారణే మేలు:
కేన్సర్ ను ముందుగానే గుర్తించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీంతో ఎన్నో ప్రాణాలను రక్షించుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. డయాబెటిస్, గుండె జబ్బులు లాంటి వాటితో కలిసి కేన్సర్ మరింతగా మానవశరీరాన్నికుంగదీస్తుందని తెలిపారు.
ప్రజలందరూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల వ్యాధిపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి కేన్సర్లు భారత్ లో ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేన్సర్ వ్యాధుల నమోదులో వీటికి 34 శాతం భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు.
గుండె సంబంధిత, డయాబెటిస్ వ్యాధులకు సంబంధించి మాత్రమే దేశంలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేన్సర్ వ్యాధి నివారణకు నిర్ధష్ట ప్రణాళికను తయారుచేయాలని సూచించడంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు నడ్డా వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్(ఎన్ఐసీపీఆర్)లతో కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు చెప్పారు. నిపుణుల సూచనల మేరకే సబ్ సెంటర్లు, ప్రాథమిక కేంద్రాల స్ధాయి నుంచి ఈ మూడు కేన్సర్ల స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Advertisement