ఎన్‌ఎండీసీ విద్యుత్ ప్లాంటుకు అనుమతి వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వ మైనింగ్ సంస్థ ఎన్‌ఎండీసీకి చెందిన ఎన్‌ఎండీసీ పవర్ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన విద్యుత్ ప్లాంటుకు అనుమతులు ఇప్పట్లో లభించేలా లేవు. ప్రతిపాదిత స్థలం సారవంతమైన వ్యవసాయ భూమి కావడంతో పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల కమిటీ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ప్రత్యామ్నాయ స్థలం ఎంపికకు ఎన్‌ఎండీసీకి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రతిపాదిత ప్రాజెక్టును పెండింగు జాబితా నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ కంపెనీ అయిన ఐఈడీసీఎల్‌తో కలసి ఎన్‌ఎండీసీ గోండా జిల్లాలో రూ.3 వేల కోట్లతో 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును నెలకొల్పాలని భావించింది. గోండా వెలుపల అనుమతి ఇవ్వతగ్గ స్థలాన్ని చూసుకోవాల్సిందిగా ఎన్‌ఎండీసీకి కమిటీ స్పష్టం చేసింది.