'పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై ఉగ్ర దాడి'
పెషావర్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్ వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ దాడులకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది చనిపోగా వారిలో పౌరులు 17 మంది, ఉగ్రవాదులు 13మంది ఉన్నారు. తొలుత ఉగ్రవాదులు పెషావర్‌కు వాయవ్య దిశగా ఉన్న బాదాబర్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డారు. లోపలికి రావడమే ఆలస్యం...... రాకెట్ లాంఛర్లతో విరుచుకు పడ్డారు. మెషిన్ గన్లతో విచక్షరహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని ఏరిపారేసేందుకు పాక్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది.
బాదాబర్ ఎయిర్‌బేస్‌పై దాడికి ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ పరిసర ప్రాంతాల్లో టెర్రరిస్టులు నిన్ననే మకాం వేసినట్లు సమాచారం. బస్సుల్లో వచ్చిన ముష్కరులు గత రాత్రి వైమానిక దళ స్థావరానికి సమీపంలో ఉన్న ఇళ్లల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గేటు నెంబర్ -2 గుండా ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... మొదట ఎయిర్‌బేస్ గార్డ్ రూమ్‌పై దాడి చేశారు. అనంతరం రాకెట్ లాంఛర్లతో వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డారు.గడిచిన కొద్ది వారాల్లో టెర్రరిస్టులు జరిపిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదే కావడం గమనార్హం.