ఆ సూత్రధారిని కూడా సైన్యం టార్గెట్ చేయాలి!
పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ ఉగ్రవాదులన్ని ఏరివేసేందుకు భారత్ సైన్యం చేసిన ‘సునిశిత దాడుల’ (సర్జికల్ స్ట్రైక్స్)పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన ఉడీ దాడులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ఈ దాడులపై సంతోషం వ్యక్తం చేశాయి. భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాద సూత్రధారుల్ని మట్టుబెట్టేందుకు కూడా భారత సైన్యం వ్యూహం రచించాలని వారు కోరారు.
ఉడీ దాడిలో మరణించిన హవల్దార్ అశోక్‌కుమార్ సింగ్ భార్య సంగీతా దేవీ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా స్థాపకుడు అయిన హఫీజ్ సయీద్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
‘భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు హఫీజ్ సయీదే సూత్రధారి. భారత సైన్యం అతన్ని లక్ష్యంగా చేసుకొని హతమార్చాలి. అతను లక్ష్యంగా ఇలాంటి దాడులు చేయాలి’ అని సంగీతాదేవి మీడియాతో పేర్కొన్నారు. మరో అమర సైనికుడు ఎస్‌కే విద్యార్థి భార్య స్పందిస్తూ సైన్యం దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఉడీ దాడులకు ముందే సైన్యం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇంతమంది సైనికులు ప్రాణాలు పోయి ఉండేవి కావని ఆమె పేర్కొన్నారు.