గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు
విభజన చట్టంలోని లోపాల వల్లే ఈ పరిస్థితి
సీఎం చంద్రబాబు వెల్లడి
కర్నూలు జిల్లాలో ఫుడ్‌పార్కు, ఇండస్ట్రియల్ హబ్‌కు శంకుస్థాపన
కర్నూలు/కడప/విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన చట్టంలోని లోపాల వల్ల గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన సోమవారం రాత్రి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన బిల్లు-లోపాలు’ పేరుతో మూడో వివరణ పత్రాన్ని విడుదల చేశారు. విభజన చట్టంలోని లోపాల వల్లే తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు ఏర్పడ్డాయని అన్నారు. ఏపీకి తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీని కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాలపై చర్చిస్తానని అన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలకు ర్యాంకులు
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు ర్యాంకులు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాలేజీలకు అఫిలియేషన్ సమయంలో అక్కడి సౌకర్యాలపై సర్వే చేయిస్తామని చెప్పారు. ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగెడంచె వద్ద అల్ట్రా మెగా ఫుడ్‌పార్కుకు, ఓర్వకల్లు మండలంలోని పూడిచర్ల వద్ద మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. పూడిచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.