చంద్రబాబుకు కష్టం వస్తే అది ప్రపంచ బాధ అయిపోవాలనుకుంటుంది ఎల్లో బ్యాచ్. చంద్రబాబు కోలుకునే వరకు ప్రపంచమంతా బాధపడుతూనే ఉండిపోవాలని ఆశపడుతుంది. ఏ రూల్ అయినా చంద్రబాబు ప్రత్యర్థులకే వర్తిస్తాయి తప్ప ఆయనకు వర్తించవని కూడా ఆ ముఠా నమ్ముతుంది. దాన్నే ప్రచారం చేస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు హూ ఈజ్ గవర్నర్ అన్నారు .హూ ఈజ్ సీబీఐ అన్నారు. ఇపుడు ప్రతీ దానికీ అదే గవర్నర్ వెంటపడుతున్నారు. అదే సీబీఐకావాలని అడుగుతున్నారు. ఆయన స్కిల్ స్కాం పైనా సీబీఐదర్యాప్తు అడిగేస్తే పోలా అంటున్నారు న్యాయ రంగనిపుణులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా..ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్పయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చినపుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. శ్రీనివాస్ అనే కుర్రాడు కోడి కత్తితో జగన్‌పై దాడికి తెగబడ్డాడు. నెత్తుటి గాయంతో ఆయన ఆసుపత్రికి తరలించారు.
అప్పుడు గవర్నర్ ఎవరు?
ఈ సమయంలో ఏపీ గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి వైఎస్ జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అంతే చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. హూ ఈజ్ గవర్నర్? అంటూ హుంకరించారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర డీజీపీని నివేదిక కోరడానికి గవర్నర్ ఎవరు? కేంద్రం ఏజెంట్‌గా ఆయన ఇక్కడ వ్యవహారాలు నడపాలనుకుంటే కుదరనే కుదరదు అంటూ సీరియస్ అయిపోయారు. గవర్నర్ వ్యవస్థనే అవమానించేలా మాట్లాడారు చంద్రబాబు ఆ రోజున.
చదవండి: న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్ నానాయాగీ
ఇప్పుడు గవర్నర్‌ను కలిసి..
ఇపుడు 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నెల రోజులు దాటినా బెయిల్ రాకపోవడంతో టీడీపీ నేతలు అసహాననికి గురయ్యారు. వెంటనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడి నేతృత్వంలో టీడీపీ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను కలిసి బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయం న్యాయస్థానంలో ఉంటే నా దగ్గరకు ఎందుకు వచ్చారు? అని గవర్నర్ విసుక్కున్నారు కూడా.
తమకో న్యాయం..ఎదుటి వారికో న్యాయమా?
చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినా.. దాని గురించి గవర్నర్ ఆరా తీయడానికి కూడా వీల్లేదన్న టీడీపీ బ్యాచ్ ఇపుడు చంద్రబాబు కోర్టు ఆదేశాల మేరకు జైలకు పంపితే అదే గవర్నర్ అవసరం అయ్యారా? అని రాజ్యాంగ నిపుణులు నిలదీస్తున్నారు. తమకో న్యాయం..ఎదుటి వారికి ఇంకో న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
హూ ఈజ్ సీబీఐ?
ఇదే కాదు 2018లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక.. బహుశా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై పూణే జీఎస్టీ అధికారులు ఆరా తీసి ఉన్నారు కాబట్టి సీబీఐ అధికారులు తన అవినీతిపై దర్యాప్తు చేస్తారేమోనన్న భయంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హూ ఈజ్ సీబీఐ? అన్నారు. నా రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదు అని తనకే సాధ్యమైన దురహంకారంతో హుంకరించారు చంద్రబాబు. సీబీఐకి నో ఎంట్రీ అంటూ ఓ జీవో తెచ్చేశారు.
చంద్రబాబు చిల్లర ఫిలాసఫీ
తాను ప్రతిపక్షంలో పడగానే చంద్రబాబు ప్రతీ దానికీ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. తన అవినీతిని వెలికి తీస్తారనుకుంటే సీబీఐ రాకూడదు. తన ప్రత్యర్ధులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి సీబీఐ వచ్చేయాలి. ఇదీ చంద్రబాబు చిల్లర ఫిలాసఫీ. 2019 ఎన్నికలకు ముందు ధర్మపోరాట డ్రామాలు చేసిన చంద్రబాబు అప్ కంట్రీ మీడియా ప్రతినిథులతో మాట్లాడుతూ హూ ఈజ్ మోదీ అన్నారు. తాను లోకేష్ తండ్రినని దేవాన్ష్ తాతనని.. భువనేశ్వరికి భర్తనని గర్వంగా చెప్పుకోగలనని.. కానీ మోదీ ఎవరు? అని చంద్రబాబు నిలదీసేసరికి జాతీయ మీడియా ప్రతినిధికి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్ధం కాక అయోమయం అయిపోయారు.
మోదీతో అవసరం లేదనుకొని..
2019ఎన్నికల్లో మోదీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే మోదీతో అవసరం లేదనుకున్నారు. అందుకే మోదీని పట్టుకుని హూ ఈజ్ మోదీ అన్నారు. అక్కడితో ఆగకుండా వ్యక్తిగత దూషణలకూ దిగారు. మోదీని ఇంటికి పంపేస్తానన్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు జావగారిపోయారు. మోదీ ఓడిపోతారనుకుని అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశామే అని నాలిక్కర్చుకున్నారు. తాను అన్న మాటలకు మోదీ కక్షగట్టేసి తన అవినీతిని వెలికి తీసి జైలుకు పంపేస్తారేమోననా భయపడ్డారు.
చదవండి: ‘బాబు అరెస్ట్‌తో హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది’
మా నాన్నను కాపాడండి ప్లీజ్ అంటూ..
ఆ భయంతోనే తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను గుట్టు చప్పుడు కాకుండా కన్నకూతుళ్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపినట్లు బీజేపీలోకి లాంఛనాలతో పంపేశారు. మోదీనే కాదు.. నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పట్టుకుని హూ ఈజ్ అమిత్ షా? అని కూడ నిలదీశారు చంద్రబాబు. కాలమహిమో చంద్రబాబు ఖర్మమో తెలీదు కానీ.. ఇపుడు అదే అమిత్ షా దగ్గరకు బీజేపీ పెద్దమ్మను తీసుకుని నారా లోకేష్ కలిసి మా నాన్నను కాపాడండి ప్లీజ్ అని ప్రాధేయ పడాల్సి వచ్చింది.
చంద్రబాబు వ్యవహార శైలే ఇలా ఉంటుంది. అందితే జుట్టు అందకుంటే కాళ్లు. హూ ఈజ్ గవర్నర్? హూ ఈజ్ సీబీఐ? హూ ఈజ్ అమిత్ షా? హూ ఈజ్ మోదీ? అని హుంకరించిన నోటితోనే గవర్నర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయిన దానికీ కాని దానికీ సీబీఐ కావాలంటున్నారు. మోదీని మించిన నాయకుడు లేనే లేడని భజన కీర్తనలూ అందుకుంటున్నారు. అమిత్ షాయే తమని ఆదుకోవాలని ఆశగా చూస్తున్నారు. ఇవన్నీ చూసిన వారు ఒకటే అడుగుతున్నారు.హూ ఈజ్ చంద్రబాబు?
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment