కూతురిపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం
మధుర: పెళ్లయి ఇద్దరు పిల్లలున్న కుమార్తెపై ఓ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రిటైర్మెంట్ మరో రెండు రోజులుందనగా పోలీస్ ఔట్‌పోస్ట్‌లోనే ఈ దారుణానికి పాల్పడటంతో అతడిని అధికారులు అరెస్ట్ చేయటంతోపాటు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంత్ పోలీస్ ఔట్ పోస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బిజేంద్ర అనే వ్యక్తి యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న మంత్ పోలీస్ ఔట్‌పోస్ట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, నలుగురు పిల‍్లలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన బిజేంద్ర భార్య పక్కనే ఫిరోజాబాద్‌లో ఉన్న పుట్టింట్లో ఉంటోంది. ఆమెను వైద్యునికి చూపించేందుకు బిజేంద్ర కుమార్తె డాక్టర్ అపాయింట్ కోసం సోమవారం ఆగ్రా వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివస్తూ తండ్రి పనిచేస్తున్న మంత్ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్దకు చేరుకుంది. తండ్రి అడగటంతో అక్కడే ఆగిపోయింది. రాత్రి సమయంలో ఆమెపై బిజేంద్ర లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలు రోదిస్తూ భర్తకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. అక్కడికి చేరుకుని ప్రశ్నించిన ఆమె భర్తపై కూడా బిజేంద్ర దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 30వ తేదీన బిజేంద్ర రిటైర్ కావాల్సి ఉన్న బిజేంద్రను పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించటంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.