
చెన్నైలో భారీ వర్షాల కారణంగా అపార్ట్ మెంట్లలోకి చేరిన నీరు
నెల రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు తల్లడిల్లిపోతున్నాయి.
సాక్షి, నెట్‌వర్క్: భారీ వర్షాలతో చెన్నై నగరం వందేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1918లో చెన్నైలో 108.8 సెంటీమీటర్ల వర్షం కురవగా, సోమవారంనాటికి చెన్నైలో వర్షపాతం 118 సెంటీ మీటర్లుగా నమోదై వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. చెన్నైలో 30 ఏళ్ల క్రితం అంటే 1985లో నవంబర్‌లో 97 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ తరువాత ఈ ఏడాదే అత్యధిక వర్షాలు కురిశాయి.
తల్లడిల్లుతున్న తమిళనాడు
నెల రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు తల్లడిల్లిపోతున్నాయి. వరుస అల్పపీడనాల కారణంగా గత నెల రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పట్లో తేరుకోలేని నష్టాన్ని భరిస్తున్న తమిళులపై ప్రకృతి ప్రకోపం ఇంకా చల్లారలేదు. తాజాగా మరోసారి వరుణుడు తమిళనాడుపై విరుచుకుపడ్డాడు.
బంగాళాఖాతం శ్రీలంక, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన రెండు అల్పపీడన ద్రోణుల ప్రభావంతో సోమవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చెరువే అయింది. చెన్నై నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ కురవనంతగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో నగరం చెరువులా మారింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వరద ముంపుతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. (చెన్నై వర్షాల ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి)
కడలూరులోని పదివేల ఇళ్లు నీటమునగగా ప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పునరావాస కేంద్రాలను తెరిచారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని చెన్నై వాతావరణ శాఖ డెరైక్టర్ రమణన్ తెలిపారు. సముద్రతీర జిల్లాలతోపాటు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 230 చేరుకోగా సోమ, మంగళవారాల్లో మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అర్ధ సంవత్సర పరీక్షలు వాయిదావేసింది.
రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్
తమిళనాడులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు మంగళవారం రంగంలోకి దిగాయి. పది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, చెన్నై, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నాయి.
గారిసన్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన ఆర్మీ బృందాలు తాంబరం, ఊరపాక్కం ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించాయి. మరోపక్క చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు ప్రవేశించడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. అదేవిధంగా పలు రైళ్లు కూడా రద్దయ్యాయి.