దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు లాభాలను అందిస్తాయనీ, ఈక్విటీలను మించిన సాధనం మరొకటి లేదని తరచుగా మార్కెట్ నిపుణులు చెపుతుంటారు. కాని ఈ మాటలతో నేను పూర్తిగా విభేదిస్తాను. కంపెనీ ఫండమెంటల్స్, ఈపీఎస్‌లను పూర్తిగా చదివి పెట్టుబడి పెట్టినా... నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి మార్కెట్ కుంభకోణాలు. ఇప్పుడు తాజాగా నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్‌లో భారీ కుంభకోణం వెలుగు చూడటంతో నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
సొంతూరులో వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉన్నా... ఉద్యోగం చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను మండపేట నుంచి హైదరాబాద్ చేరుకున్నా. ఇది 1980నాటి మాట. ఎంకాం పూర్తిచేశాక భాగ్యనగరంలో ఒక చిన్న ఉద్యోగంలో చేరా. పంటల మీద వచ్చే డబ్బుకి తోడు ఖర్చులకు ఎలాగూ జీతం ఉండటంతో నా దృష్టి స్టాక్ మార్కెట్‌పై పడింది. చిన్నగా షేర్లు కొనడం మొదలు పెట్టా. సెకండరీ మార్కెట్లో భారీ లాభాలు కాకపోయినా ఒక మోస్తరు లాభాలు వచ్చాయి. అప్పట్లో వారానికి 15 నుంచి 20 పబ్లిక్ ఇష్యూలు వచ్చేవి. నెమ్మదిగా వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టా. దీంతో నా దగ్గర ఉన్నదీ, సంపాదిస్తున్నదీ అంతా మార్కెట్లో పెట్టుబడిగా వెళ్లిపోయింది. ఒక స్వల్ప లాభం కళ్ల చూసే లోగా ఇంతలో భారీ నష్టం వచ్చేది. ఇదంతా సహజమే కదా అని సరిపెట్టుకునే వాడిని. ఇలా సాగిపోతున్న తరుణంలో అంతవరకు పరిచయం లేని ఒక పదం నా ట్రేడింగ్ జీవితంలోకి ప్రవేశించింది. అదే కుంభకోణం! స్టాక్ మార్కెట్లు కూడా కుంభకోణాలకు అతీతం కాదని తొలిసారిగా తెలిసింది. ఒక్కసారిగా బద్దలైన హర్షద్ మెహతా కుంభకోణం నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసింది. ఆ దెబ్బతో షేర్లు అధఃపాతాళానికి చేరిపోయాయి.
ఈపీఎస్ చదివి పెట్టుబడి పెట్టినా పీస్ లేకుండా చేశాయి. బుక్ వేల్యూ చూసినా నా పేపర్ సర్టిఫికెట్‌కి వేల్యూ లేకపోవడంతో అవి నన్ను వెక్కిరించాయి. ఇలాంటి పతనంలో కూడా యథావిధిగా పత్రికలు, బ్రోకర్లు.. షేర్లు ఫండమెంటల్‌గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయని, ఇంకా కొనమంటూ సలహా ఇచ్చాయి. ఉన్న షేర్లు అమ్మితే కొన్న ధరలో వందో వంతు కూడా రాని పరిస్థితి అది. కాలం కలిసి రాకపోతే ఇంతే అని సరిపెట్టుకొని తిరిగి సంపాదించుకోగలను అన్న నమ్మకంతో మార్కెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. ఇంతలో కేతన్ పరేఖ్ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. వరుసగా రెండో దెబ్బ పడటంతో తట్టుకోవడం నా వల్ల కాలేదు. లక్ష రూపాయల్లో ఉండే షేర్ల విలువ వందల్లోకి వచ్చేసింది. ప్రైమరీ మార్కెట్లో అలాట్ అయిన షేర్లు చిన్న లాభాలతో ట్రేడ్ అవుతుంటే కేతన్ పరేఖ్ దెబ్బకి వాటి అడ్రస్‌లే గల్లంతయ్యాయి. ఇప్పటికీ నా దగ్గర స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ కాని చాలా షేర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నేను అంతకుముందు సంపాదించినదంతా కోల్పోయాను. ఇక్కడ నేను చెప్పదల్చుకున్నదల్లా ఒక్కటే... ఎన్ని ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్ చేసినా... ఒక్క కుంభకోణం బయటపడితే ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఆవిరైపోతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కుంభకోణాలు అనే రిస్క్ కూడా ఎప్పుడూ పొంచి ఉంటుందన్న విషయం మర్చిపోవద్దన్నదే నా సలహా. - జీఆర్‌కే, మండపేట
ఇక్కడా స్కామ్‌లుంటాయ్ జాగ్రత్త!
Published Sun, Sep 15 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement