వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో ఒడుదొడుకులకు లోనయిన స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటాయా? లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ ఎలా ఉండబోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరల ప్రభావం మార్కెట్‌పై ఏమేరకు ఉంటుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్‌పై ఎలా ఉండబోతాయనే వివరాలపై ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు.
నిఫ్టీ 19,900 పైన ముగిసే వరకు స్టాక్‌మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగుతాయని అంచనా. నిఫ్టీ ఇండెక్స్ 19,900 కంటే ఎక్కువ లేదా 19,600 కంటే దిగువకు వెళ్తే తప్పా పెరగడం లేదా తగ్గడాన్ని అంచనావేయలేం. అప్పటివరకు రాబోయే సెషన్లలో రేంజ్‌బౌండ్ ట్రేడ్ కొనసాగే అవకాశం ఉంది. గతవారం మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. ఫెడ్ మినట్స్‌మీటింగ్ ద్వారా భవిష్యత్తులో కేంద్రబ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికంగా వడ్డీరేట్లు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. 20 వారాల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రకారం 19,400 వద్ద మంచి సపోర్ట్ కనిపిస్తోంది.
క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ల కోసం సింగపూర్ కఠిన నియమాలను ప్రవేశపెడుతుంది . క్రిప్టో సర్వీస్ ప్రొవైడర్లు స్థానికంగా జారీ చేసిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అక్కడి ప్రభుత్వ నిలిపేసింది. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా వరుస బాంబు దాడులు కొనసాగుతున్నాయి. గాజా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని అంచనా. యుద్ధానికి ముందు కూడా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రకారం.. చాలా మంది గాజా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతుండేవారని తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అంచనా ప్రకారం.. ఆర్థిక, ఆరోగ్య, విద్యా సూచికల్లో దేశం తిరిగి మెరుగవాలంటే దాదాపు 16-19 ఏళ్లు పడుతుందని సమాచారం.
చమురు ఉత్పత్తిదారుల 23 దేశాల ఒపెక్ కూటమి తదుపరి సమావేశాన్ని నవంబర్ 30కి వాయిదా వేసింది. సౌదీ అరేబియా, కొన్ని ఆఫ్రికన్ దేశాల మధ్య విభేదాలు కారణంగా చమురు ధరలు పడిపోతున్నట్లు తెలిసింది. చమురు, గ్యాస్ కంపెనీలు క్లీన్ ఎనర్జీలో మరింత పెట్టుబడి పెట్టాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచించింది. వచ్చే వారం దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి క్లైమెట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. వాతావరణంలో వివిధ ఉద్గారాలను తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. అందుకు సంబంధించిన కంపెనీ స్టాక్‌ల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. క్లీన్‌ఎనర్జీపై పనిచేసే బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టాలి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గిపోతోంది. ఆర్‌బీఐ తన వద్ద ఉన్న ఫారెక్స్ రిజర్వ్‌లను అమ్మి రూపాయి మరింత పడకుండా నిరోధిస్తుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు దేశీయ మార్కెట్‌ను మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. దాంతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్‌లో కొనుగోలు చేసేలా సిద్ధంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment