‘గ్రేటర్’పై హైడ్రామా | High Drama on Greater GHMC elections! | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’పై హైడ్రామా

Published Wed, Jan 6 2016 2:39 AM | Last Updated on Wed, Sep 5 2018 2:01 PM

‘గ్రేటర్’పై హైడ్రామా - Sakshi

‘గ్రేటర్’పై హైడ్రామా

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ వ్యూహాత్మక ఎత్తుగడ   
* షెడ్యూల్ కుదింపుపై న్యాయపర అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులను సవాలు చేస్తూ విపక్షాలు న్యాయస్థానం గడప తొక్కకుండా నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించడం లేదని తెలుస్తోంది.

ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ మూడు రోజుల కిందే సీఎం కేసీఆర్ సంతకం చేయడం గమనార్హం. మొత్తంగా డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటించిన వెంటనే... రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకకాలంలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌లను ప్రకటించే విధంగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ జారీ తర్వాత ఒకట్రెండు రోజులకు నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనవాయితీ. అయినా ఈసారి షెడ్యూల్‌తోపాటే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం పథక రచన చేసింది.

దీని ప్రకారం ఈ నెల 7వ తేదీన రాత్రి ప్రభుత్వం డివిజన్ల రిజర్వేషన్లను ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్‌లను విడుదల చేయనుంది. ఎన్నికల సంఘం ఓ సారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత న్యాయస్థానాలు ఎలాంటి అభ్యంతరాలపై అయినా వ్యాజ్యాలను స్వీకరించవు. అంటే రాత్రి రిజర్వేషన్లు ప్రకటించి, ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు వస్తే... అనంతరం ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఎందుకింత వ్యూహాత్మకం?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియను 26 రోజుల నుంచి 15 రోజులకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించింది. నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ గడువును 4-7 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించింది. అయితే కేవలం మూడు రోజుల వ్యవధిలో రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం రాజకీయ పార్టీలకు సవాలుగా మారనుంది. దాంతోపాటు మొత్తంగా 15 రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయి. దీనివల్ల ప్రచారం నిర్వహించేందుకు సరిపడా సమయం లభించే అవకాశాలు ఉండవని పార్టీలు భావిస్తున్నాయి.

అసలు ఎన్నికల షెడ్యూల్‌ను కుదించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్ల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏ చట్టానికైనా సవరణలు జరపవచ్చని పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 పేర్కొంటోంది. ఈ వెసులుబాటు ఆధారంగానే ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించి ఎన్నికల షెడ్యూల్‌ను కుదించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-101 ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసింది. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాలను ప్రవేశపెట్టేందుకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటుహక్కు కల్పించేందుకు ఇదే బాటను అనుసరించింది.

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుపరిపాలన వేదిక అనే సంస్థ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. స్వీయ అవసరాల కోసం ప్రభుత్వం పదేపదే పునర్విభజన చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
 
సెలవు వచ్చినా లెక్కలోకే..!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు టీఆర్‌ఎస్ సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి ప్రభుత్వ సెలవు దినాలు. ఇవి ఎన్నికల ప్రక్రియ మధ్యలో వస్తే.. ఆ తర్వాతి రోజులకు నామినేషన్లు, ఉపసంహరణ వంటివి పొడిగించాలి. దీంతో ఎన్నికల ప్రక్రియ గడువును కుదించి కూడా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావి స్తోంది. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియను 3 వారాల నుంచి 2 వారాలకు కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

అందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించింది. కానీ నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలకు నిర్దేశించిన తేదీల్లో సెలవు దినాలుంటే మరు సటి పనిదినం నాడు వాటిని అనుమతించాలని ఇదే చట్టంలో సెక్షన్-40 చేబుతోంది.  ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ గడువులో సెలవు దినాలున్నా... వాటిని సైతం  వర్కింగ్ డేలుగానే పరిగణించేలా సెక్షన్-40ని సవరించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై బుధవారం ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement