
తీవ్ర ఉత్కంఠ; హిల్లరీ, ట్రంప్ మధ్య హోరాహోరీ
వాషింగ్టన్: ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మెజార్టీ మార్క్కు చేరువయ్యారు. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 244 ఓట్లు సాధించారు. కాగా విజయం ఖాయమని భావించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ 215 ఓట్లతో వెనుకబడ్డారు. మెజార్టీ సాధించాలంటే 270 ఓట్లు అవసరం.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం మొదలైన ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్ ముందంజలో నిలిచారు. కాసేపటి తర్వాత హిల్లరీ ఆధిక్యం కనబరిచారు. ఆ వెంటనే ట్రంప్ దూసుకెళ్లారు. ఓ దశలో ట్రంప్ హిల్లరీ కంటే దాదాపు 57 ఓట్లు ఎక్కువ సాధించారు. ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు. ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడని తెలిసేసరికి భారత్ స్టాక్ మార్కెట్లు సహా ఆసియా, అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. కాగా కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాలు వెలువడగానే హిల్లరీ ట‍్రంప్‌ను వెనక్కునెట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. హిల్లరీ 190, ట్రంప్ 186 ఓట్లు సాధించారు. అయితే హిల్లరీ ఇదే జోరు కొనసాగించలేకపోయారు. ట్రంప్ మళ్లీ ముందంజలోకి వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ ఆధిక్యం కొనసాగిస్తూ వస్తున్నారు. 23 రాష్ట్రాల్లో ట్రంప్, 17 రాష్ట్రాల్లో హిల్లరీ ముందంజలో నిలిచారు.