హిందూ అమెరికన్ల ఆగ్రహం
అఘోరాలపై అసత్య కథనాన్ని ప్రచారం చేశారని సీఎన్‌ఎన్‌పై మండిపాటు
వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్ చానెల్‌లో ఆదివారం ప్రసారమైన ‘బిలీవర్ విత్ రెజా అస్లాన్’ అనే ఆరు ఎపిసోడ్ల కార్యక్రమంలో అఘోరాల గురించి అసత్యాలు ప్రసారం చేశారని.. అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ప్రముఖ భారత అమెరికన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు శలభ్ కుమార్ ఈ కథనంపై తీవ్రంగా మండిపడ్డారు.
‘హిందూయిజంపై జరుగుతున్న దాడి ఇది. అమెరికాలోని మెజారిటీ భారతీయులు, హిందువులు గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగానే ఉద్దేశపూర్వకంగానే హిందూత్వంపై దాడిచేస్తున్నారు’ అని ట్విటర్ వేదికగా విమర్శించారు. అమెరికాలోని పలు హిందూ సంస్థలు, వ్యక్తులు కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలపాయి.
‘ఇటీవల అమెరికాలోని మైనారిటీల (భారతీయులు)పై దాడులు జరగుతున్న సమయంలో ఇలాంటి విద్వేషపూరిత, అసత్య కథనాలను ప్రసారం చేయటం మరింత ఘర్షణకు దారితీస్తాయి’ అని కాలిఫోర్నియా హిందూ సమాజం నేత ఖండేరావ్ కాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పురీ కూడా ఓ ప్రకటనలో ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన సీఎన్‌ఎన్‌ను కోరారు.