
పోయిందనుకున్న హెచ్ఐవీ మళ్లీ వచ్చింది!!
రక్తంలోని మూలుగ మార్పిడి చికిత్స చేసిన తర్వాత ఇద్దరు రోగులకు పూర్తిగా నయం అయ్యిందనుకున్న హెచ్ఐవీ మళ్లీ వచ్చిందని అమెరికా వైద్యులు చెబుతున్నారు.
రక్తంలోని మూలుగ మార్పిడి చికిత్స చేసిన తర్వాత ఇద్దరు రోగులకు పూర్తిగా నయం అయ్యిందనుకున్న హెచ్ఐవీ మళ్లీ వచ్చిందని అమెరికా వైద్యులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు అంచనా వేసినదానికంటే వైరస్ను కలిగి ఉన్న హెచ్ఐవీ రిజర్వాయర్లు, లేటెంట్ కణాలు చాలా లోతుగా ఉన్నాయని దీనివల్ల తేలినట్లు అమెరికాలోని బోస్టన్ బ్రిగామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ వైద్యుడు, పరిశోధకుడు టిమోతీ హెన్రిచ్ తెలిపారు.
తాము చికిత్స చేసిన రోగులకు మళ్లీ హెచ్ఐవీ రావడం చాలా నిరుత్సాహంగానే ఉన్నా, శాస్త్రీయంగా మాత్రం ఇది చాలా కీలకమని హెన్రిచ్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్ఐవీని అంచనా వేయడంలో మనం ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రమాణాలు ఏమాత్రం సరిపోవన్న విషయం అర్థమవుతోందన్నారు. 2008, 2010 సంవత్సరాల్లో ఇద్దరు హెచ్ఐవీ రోగులకు మూలుగ మార్పిడి చికిత్సలు చేశారు. ఆ తర్వాత దాదాపు 8 నెలల పాటు వారిద్దరిలోనూ హెచ్ఐవీ లక్షణాలు కనిపించలేదు. దాంతో ఈ సంవత్సరం యాంటీ రిట్రోవైరల్ చికిత్స ఆపేద్దామని భావించి వాళ్లు మరోసారి పరీక్ష చేయించుకోగా, వాళ్ల శరీరంలో అప్పటికి వైరస్ కనిపించలేదు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ పరీక్షిస్తే హెచ్ఐవీ కనిపించింది! దాంతో మళ్లీ చికిత్స మొదలుపెట్టాల్సి వచ్చింది.