భారతీయులకు వీసా-ఫ్రీ సౌకర్యం రద్దు
బీజింగ్ : భారత ప్రయాణికులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం హాంకాంగ్. చైనా ప్రత్యేక పాలనలో ఉన్న ఈ హాంకాంగ్ ప్రస్తుతం భారత ప్రయాణికులకు షాకిచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న వీసా ఫ్రీ సౌకర్యాన్ని సోమవారం నుంచి ఉపసంహరిస్తున్నట్టు పేర్కొంది. సోమవారం నుంచి భారతీయులు తమ రాకను ముందస్తుగా ఆన్లైన్లో నమోదుచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. హాంకాంగ్కు రావడానికి భారతీయులకు జనవరి నుంచి ప్రీ-అరైవల్ రిజిస్ట్రేషన్ను అమల్లోకి తెస్తామని, ఈ ఆన్లైన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు హాంకాంగ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
భారత దేశానికి చెందిన వారు కచ్చితంగా దీన్ని అప్లయ్ చేసుకోవాలని, హాంకాంగ్ సందర్శించే ముందు ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ను ఆన్లైన్లో దాఖలు చేసుకోవాలని తెలిపింది. ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఆరు నెలల వరకు వాలిడ్లో ఉంటుంది. ఈ కాలంలో అప్లికెంట్ ఎన్నిసార్లైనా హాంకాంగ్ను సందర్శించుకోవచ్చు. ఈ ప్రభావం వేలకొద్దీ భారతీయులపై ప్రభావం చూపనుంది. భారత వ్యాపారవేత్తలు, పర్యాటకులు హాంకాంగ్ను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇన్నిరోజులు వీరందరికీ వీసా అవసరం లేకుండానే కేవలం వాలిడ్ పాస్పోర్టుతో 14 రోజుల పాటు హాంకాంగ్లో పర్యటించే అవకాశం ఆ దేశం కల్పించింది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల తాకిడి పెరగడంతో హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే చైనా ఒత్తిడితోనే హాంకాంగ్ దీన్ని ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.