భారత్ తలుచుకుంటే పాక్ ను నలిపేయొచ్చు
న్యూఢిల్లీ: ఏళ్లుగా భారత్ పై ఉగ్రవాద దాడులు చేయిస్తూ ప్రపంచసభలలో నీతి సూక్తులు వల్లించే పాకిస్తాన్ ను భారత్ తలుచుకుంటే ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. అవును. సింధు నదీ జలాల్లో ఒప్పందం ప్రకారం మనకున్న హక్కును ఉపయోగించుకున్నా.. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా.. అది పాకిస్తాన్ పాలిట యమపాశమే అవుతుంది.
ఉడీ దాడిలో 18మంది సైనికులను పొట్టనబెట్టుకోవడమే కాక.. కశ్మీర్ లో కల్లోలాలు సృష్టిస్తోంది భారతేనని పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో చెప్పింది. దీంతో ఎన్నడూ లేని విధంగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ పాక్ కు ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. అంతేకాదు అప్పటివరకూ అంతర్జాతీయ రాజకీయాల్లో సంయమనంతో అడుగులేస్తున్న భారత ప్రభుత్వంలో తీవ్ర కదలిక మొదలైంది.
యుద్ధాల సమయంలో కూడా రద్దు చేసుకోని ఒప్పందాన్ని కొనసాగించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. రక్తం నీరూ కలిసి ఒకేసారి ప్రవహించలేవంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఒక్కటే రద్దు చేసుకోలేదని పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తి మాటలే. భారత్ తలుచుకుంటే ఒప్పందాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. ఇందుకు సంకేతాలను కూడా ఇప్పటికే భారత్ బయటపెట్టింది.
ఒప్పందానికి సంబంధించిన వివరాలు:
సింధు జలాల శాశ్వత కమిషన్
ఒప్పందం ప్రకారం సింధు జలాలను పంపీణీ చేసే క్రమంలో శాశ్వత కమిషన్ ను నియమించారు. ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఇరుదేశాల్లో లేనప్పుడే సింధు జలాల కమిషనర్లు సమావేశం అవుతారు. ఇలా సంవత్సరానికి రెండు సార్లు ఇరుదేశాల కమిషనర్లు సమావేశమౌతారు. ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకూ(1965,1971,కార్గిల్ యుద్ధ సమయాల్లో కూడా) ప్రతి ఏటా కమిషనర్లు సమావేశమౌతూనే ఉన్నారు.
ప్రభావం
పాకిస్తాన్ ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఎలా అంటే..
- ఒప్పందం ప్రకారం ఇరుదేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మూడు దశల్లో పరిష్కరించుకోవచ్చు. ఇరు దేశాలు రెండేళ్ల పాటు వివాదంపై సంప్రదింపులు జరుపుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే..ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇదీ సఫలం చెందకపోతే ఇరువర్గాలు యూఎన్ కోర్టును ఆశ్రయించవచ్చు.
- అయితే, ఇందులో ఒక మెలిక ఉంది. ఆ మెలికే ఇప్పుడు పాక్ మెడకు ఉరితాడు కానుంది. ఇరుదేశాలు రెండేళ్ల పాటు జరగాల్పిన చర్చల్లో ఏదైనా ఒక దేశం చర్చలకు ముందుకు రాకపోతే మిగిలిన రెండు దశలకు వెళ్లే అవకాశాన్ని అవతలి దేశం కోల్పోతుంది. ఇప్పుడు ఈ మెలికనే భారత్ పావుగా వాడుకుంటోంది. పాకిస్తాన్ రాయబారి సర్తాజ్ అజీజ్ నీటి సమస్యపై భారత్ ను చర్చలకు ఆహ్వానించినా అందుకు తిరస్కరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్ధితిలో ఉన్న పాకిస్తాన్ ప్రపంచ బలమైన ఆర్ధిక వ్యవస్ధల వద్దకు తీసుకెళతాం అంటూ భీకరంగా నటిస్తోంది.
నీటి పంపకాలపై చర్చలకు 'నో' చెప్పేసిన భారత్ కు పాక్ ను ఇంకా ముప్పతిప్పలు పెట్టేందుకు రెండు భారీ అవకాశాలున్నాయి. వీటిని భారత్ గనుక వినియోగించుకుందంటే పాకిస్తాన్ అన్నివిధాల తీవ్రపరిణామాలను ఎదుర్కొంటుంది.అవేంటో చూద్దాం.
1.తుల్ బుల్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడం
1987లో పాకిస్తాన్ తుల్ బుల్ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో భారత్ నిర్మాణాన్ని నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత భారత్ ఈ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పేర్కొంది. పాక్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి చేపట్టే యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది.
ప్రభావం
439 అడుగుల తుల్ బుల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జీలం నదీ జలాలపై భారత్ పట్టు సాధిస్తుంది. ఇది పాకిస్తాన్ ను వ్యవసాయపరంగా సంక్షోభంలోకి నెడుతుంది.
- జీలం-చీనాబ్ నదులను కలుపుతూ ఉండే అప్పర్ బారీ డోఆబ్ కెనాల్(దీన్ని పాకిస్తానీలు ట్రిపుల్ కెనాల్ ప్రాజెక్టు అంటారు)కు తుల్ బుల్ నిర్మాణం సమస్యలను తెస్తుంది.
- ఈ ప్రాజెక్టు ద్వారా జీలం నదిపై భారత్ పట్టు సంపాదించడం వల్ల పాక్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్(పీఓకే)ల్లో వరదలు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.
2. ఇంటర్ మినిస్టేరియల్ టాస్క్ ఫోర్స్
పశ్చిమ దిశ నుంచి వచ్చే నదుల్లో నీటి వినియోగంపై భారత్ టాస్క్ ఫోర్స్ ను వేసింది. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి సంపదను భారత్ ఎంతైనా వినియోగించుకోవచ్చు. కానీ, పశ్చిమంగా ప్రవహించే నదుల నుంచి కేవలం 20శాతం నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది.
ప్రభావం
భారత్ కావాలనుకుంటే జీలం, చినాబ్, సింధు నదుల నీటిని కూడా అపరిమితంగా వాడుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడుతుంది.