Indus Water Treaty
-
‘ఆ నీళ్లు ఇవ్వకపోయినా ఇబ్బందేం లేదు’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ చుట్టూ భారత్ ఉచ్చు బిగుస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెచ్చరికలను పాక్ పట్టించుకోవడం లేదు. నీళ్లు ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పాకిస్తాన్ తెలిపినట్లు సమాచారం. ఈ విషయం గురించి పాకిస్తాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్ మాట్లాడుతూ.. ‘సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్తాన్‌కు, మరో మూడు నదులపై ఇండియాకు హక్కులు ఉన్నాయి. మూడు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు.. మూడు తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్‌పై భారత్‌కు హక్కులున్నాయి. అయితే భారత్‌కు హక్కులున్న నదుల్లో మిగులు నీరు పాకిస్తాన్‌కు వెళ్తున్నది. ఇప్పుడు ఈ జలాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ నీటిని భారత్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మాకు నష్టం లేదు’ అని ఆయన అన్నారు.(పాక్‌పై జలఖడ్గం) అంతేకాక ‘ఈ జలాల విషయమై మాకు ఆందోళనగానీ, అభ్యంతరంగానీ ఏమీ లేదు. ఆ నదుల్లోని నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు. సింధూ నదీ జలాల ఒప్పందం కూడా అందుకు అనుమతి ఇచ్చింది’ అని స్పష్టం చేశారు. అయితే తమకు హక్కులున్న పశ్చిమ నదులు చీనాబ్, సింధు, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం తమ అభ్యంతరాలను లేవనెత్తుతామ’ని ఆయన తెలిపారు. -
అలా.. నడుచుకుందాం
ఒప్పందం ప్రకారం ముందుకెళదాం అలాచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది వరల్డ్ బ్యాంక్కూడా మా వైపే ఉంది ఐరాసలో పాక్ ప్రధాని ఐక్యరాజ్య సమితి : సింధూ నదీ జలాలపై పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది. సింధూనదిపై భారత్ కేవలం విద్యుత్ అవసరాలకోసమే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నా.. పాక్ మాత్రం వాటిపై వివాదాలను రాజేస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ.. సింధూ నదీ జలాలపై గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఇరు దేశాల మధ్య నదీ జలాల విషయంపై ఎటువంటి వివాదాలు చెలరేగిన ఒప్పందం ప్రకారంపరిష్కరించుకోవచ్చని తెలిపారు. నదీ జలాలపై ఏర్పడ్డ సమస్య విషయంలో ప్రపంచ బ్యాంక్ కూడా మా వైఖరిని సమర్థించిందని పేర్కొన్నారు. సింధూనదిపై భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టు వివాదంపైఘీ నెల 14,15 తేదీల్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భారత్-పాక్దేశాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ చర్చలు ఏ మాత్రం ఫలవంతం కాలేదు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్-పాకిస్తాన్లో 1960లో ప్రపంచబ్యాంక్ సమక్షంలో సింధూ నదీ జలాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నదీ జలాలపై ఏమైనా సమస్యలు, వివాదాలు ఏర్పడితే.. ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వం చేయవచ్చు. -
ఏకపక్షంగా తప్పుకోవద్దు: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: సింధు నదీ జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ల పరస్పర అంగీకారంతో 1960లో కుదిరిందని, ఏ ఒక్క దేశం ఏకపక్షంగా ఒప్పందం నుంచి తప్పుకోలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ భద్రతకు అంతర్గతంగాను, బయటి దేశాల నుంచి కూడా ఏ ముప్పూ లేదని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని బుధవారం అధికారులతో జరిగిన భేటీలో అన్నారు. ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అధీనంలో ఉన్న నదుల్లోని నీటిని గరిష్టంగా వినియోగించాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాక్ ప్రతినిధుల బృందం ప్రపంచ బ్యాంకు అధికారులతో భేటీ అయింది. ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన బ్యాంకు తటస్థంగా ఉంటూనే ఒప్పంద అంశాన్ని సకాలంలో పూర్తిచేసే బాధ్యత తనకు ఉందని పేర్కొన్నట్లు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. -
భారత్ తలుచుకుంటే పాక్ ను నలిపేయొచ్చు
న్యూఢిల్లీ: ఏళ్లుగా భారత్ పై ఉగ్రవాద దాడులు చేయిస్తూ ప్రపంచసభలలో నీతి సూక్తులు వల్లించే పాకిస్తాన్ ను భారత్ తలుచుకుంటే ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. అవును. సింధు నదీ జలాల్లో ఒప్పందం ప్రకారం మనకున్న హక్కును ఉపయోగించుకున్నా.. నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా.. అది పాకిస్తాన్ పాలిట యమపాశమే అవుతుంది. ఉడీ దాడిలో 18మంది సైనికులను పొట్టనబెట్టుకోవడమే కాక.. కశ్మీర్ లో కల్లోలాలు సృష్టిస్తోంది భారతేనని పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో చెప్పింది. దీంతో ఎన్నడూ లేని విధంగా యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ పాక్ కు ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. అంతేకాదు అప్పటివరకూ అంతర్జాతీయ రాజకీయాల్లో సంయమనంతో అడుగులేస్తున్న భారత ప్రభుత్వంలో తీవ్ర కదలిక మొదలైంది. యుద్ధాల సమయంలో కూడా రద్దు చేసుకోని ఒప్పందాన్ని కొనసాగించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. రక్తం నీరూ కలిసి ఒకేసారి ప్రవహించలేవంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఒక్కటే రద్దు చేసుకోలేదని పాక్ చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తి మాటలే. భారత్ తలుచుకుంటే ఒప్పందాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చు. ఇందుకు సంకేతాలను కూడా ఇప్పటికే భారత్ బయటపెట్టింది. ఒప్పందానికి సంబంధించిన వివరాలు: సింధు జలాల శాశ్వత కమిషన్ ఒప్పందం ప్రకారం సింధు జలాలను పంపీణీ చేసే క్రమంలో శాశ్వత కమిషన్ ను నియమించారు. ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఇరుదేశాల్లో లేనప్పుడే సింధు జలాల కమిషనర్లు సమావేశం అవుతారు. ఇలా సంవత్సరానికి రెండు సార్లు ఇరుదేశాల కమిషనర్లు సమావేశమౌతారు. ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకూ(1965,1971,కార్గిల్ యుద్ధ సమయాల్లో కూడా) ప్రతి ఏటా కమిషనర్లు సమావేశమౌతూనే ఉన్నారు. ప్రభావం పాకిస్తాన్ ఈ అవకాశాన్ని కోల్పోయింది. ఎలా అంటే.. - ఒప్పందం ప్రకారం ఇరుదేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మూడు దశల్లో పరిష్కరించుకోవచ్చు. ఇరు దేశాలు రెండేళ్ల పాటు వివాదంపై సంప్రదింపులు జరుపుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే..ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇదీ సఫలం చెందకపోతే ఇరువర్గాలు యూఎన్ కోర్టును ఆశ్రయించవచ్చు. - అయితే, ఇందులో ఒక మెలిక ఉంది. ఆ మెలికే ఇప్పుడు పాక్ మెడకు ఉరితాడు కానుంది. ఇరుదేశాలు రెండేళ్ల పాటు జరగాల్పిన చర్చల్లో ఏదైనా ఒక దేశం చర్చలకు ముందుకు రాకపోతే మిగిలిన రెండు దశలకు వెళ్లే అవకాశాన్ని అవతలి దేశం కోల్పోతుంది. ఇప్పుడు ఈ మెలికనే భారత్ పావుగా వాడుకుంటోంది. పాకిస్తాన్ రాయబారి సర్తాజ్ అజీజ్ నీటి సమస్యపై భారత్ ను చర్చలకు ఆహ్వానించినా అందుకు తిరస్కరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్ధితిలో ఉన్న పాకిస్తాన్ ప్రపంచ బలమైన ఆర్ధిక వ్యవస్ధల వద్దకు తీసుకెళతాం అంటూ భీకరంగా నటిస్తోంది. నీటి పంపకాలపై చర్చలకు 'నో' చెప్పేసిన భారత్ కు పాక్ ను ఇంకా ముప్పతిప్పలు పెట్టేందుకు రెండు భారీ అవకాశాలున్నాయి. వీటిని భారత్ గనుక వినియోగించుకుందంటే పాకిస్తాన్ అన్నివిధాల తీవ్రపరిణామాలను ఎదుర్కొంటుంది.అవేంటో చూద్దాం. 1.తుల్ బుల్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడం 1987లో పాకిస్తాన్ తుల్ బుల్ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో భారత్ నిర్మాణాన్ని నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత భారత్ ఈ ప్రాజెక్టును పక్కనబెట్టినట్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పేర్కొంది. పాక్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి చేపట్టే యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. ప్రభావం 439 అడుగుల తుల్ బుల్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జీలం నదీ జలాలపై భారత్ పట్టు సాధిస్తుంది. ఇది పాకిస్తాన్ ను వ్యవసాయపరంగా సంక్షోభంలోకి నెడుతుంది. - జీలం-చీనాబ్ నదులను కలుపుతూ ఉండే అప్పర్ బారీ డోఆబ్ కెనాల్(దీన్ని పాకిస్తానీలు ట్రిపుల్ కెనాల్ ప్రాజెక్టు అంటారు)కు తుల్ బుల్ నిర్మాణం సమస్యలను తెస్తుంది. - ఈ ప్రాజెక్టు ద్వారా జీలం నదిపై భారత్ పట్టు సంపాదించడం వల్ల పాక్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్(పీఓకే)ల్లో వరదలు వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. 2. ఇంటర్ మినిస్టేరియల్ టాస్క్ ఫోర్స్ పశ్చిమ దిశ నుంచి వచ్చే నదుల్లో నీటి వినియోగంపై భారత్ టాస్క్ ఫోర్స్ ను వేసింది. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి సంపదను భారత్ ఎంతైనా వినియోగించుకోవచ్చు. కానీ, పశ్చిమంగా ప్రవహించే నదుల నుంచి కేవలం 20శాతం నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రభావం భారత్ కావాలనుకుంటే జీలం, చినాబ్, సింధు నదుల నీటిని కూడా అపరిమితంగా వాడుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడుతుంది. -
'పాక్, ఇండియాలు దగ్గరవ్వాలి: చైనా
బీజింగ్: ఉడీ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సింధూ జలాల ఒప్పందం రద్దు, సీమాంతర ఉగ్రవాదం తదితర విషయాలపై చైనా ఆచితూచి స్పందించింది. అసలు వైఖరి ఎలా ఉన్నప్పటికీ పైకి మాత్రం శాంతివచనాలు వల్లెవేసింది. ఇండియా-పాకిస్థాన్ లు కలిసి కూర్చుని చర్చించుకోవడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుంగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. 'పాకిస్థాన్, ఇండియాలు పరస్పరం చర్చించుకుని, సంప్రదింపుల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందంపై ఒక నిర్ణయానికి వస్తాయని ఆశిస్తున్నాం. ఇరువురి మధ్య మైత్రినెలకొనాలని బాధ్యతగల పొరుగుదేశంగా చైనా కోరుకుంటోంది. ఆసియాలో శాంతి, సుస్థిరతలకు భారత్-పాక్ ల స్నేహం ఎంతో కీలకం. అయితే సీమాంతర ఉగ్రవాదం లేనప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆమేరకు ఇరు దేశాలూ దగ్గరవ్వాలి'అని జెంగ్ షుంగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. '1960 నాటి సింధూ జలాల ఒప్పందం'పై సోమవారం ఢిల్లీలో సమీక్షజరిపిన ప్రధాని మోదీ.. పాక్ వైపునకు ప్రవహిస్తోన్న నదీ జలాల్లో భారత్ కు ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింధూ ఒప్పందం రద్దుపై స్పష్టత రావాల్సిఉన్నది. మరోవైపు పాక్.. సింధూ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దుచేసుకోలేదని, ఒకవేళ అలా చేస్తే ఐక్యరాజ్యసమితికి, భద్రతామండలికి ఫిర్యాదుచేస్తామని ప్రకటించింది. -
నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు
పాక్‌తో సింధు నీటి ఒప్పందం సమీక్షలో ప్రధాని మోదీ - పాకిస్తాన్ నియంత్రణలోని నదుల నీటిని గరిష్టంగా - వాడాలని నిర్ణయం ఒప్పంద అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటి ని గరిష్టంగా వినియోగించుకోవాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్-పాక్ సింధు జలాల ఒప్పందంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయి నీటిని వినియోగించాలంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఎదురుదాడిని ఉధృతం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. నదీ జలాల ఒప్పందంపై పూర్తి వివరాల అధ్యయనానికి అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఒప్పందం పూర్తిస్థాయిలో తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. టాస్క్‌ఫోర్స్ బృందంలో జలవనరులు, విదేశాంగ, విద్యుత్, ఆర్థిక శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తూర్పుకు ప్రవహించే నదుల్లో(సింధు, చినాబ్, జీలం) భారత్ హక్కులపై బృందం అధ్యయనం చేస్తుంది. చీనాబ్‌పై పాకల్‌డల్, సవాల్కోట్, బుర్సార్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, జలవనరుల కార్యదర్శితో పాటు పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింధు ఒప్పందం, నదులపై ఉన్న ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రధానికి కూలంకషంగా వివరించారు. భవిష్యత్తులో ‘ఇండస్ వాటర్ కమిషన్’ సమావేశాలు ఉగ్రవాద రహిత వాతావరణంలోనే సాధ్యమంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. అలాగే 1987 నాటి టుల్బుల్ నావికా మార్గం రద్దుపై సమీక్షించాలని కూడా నిర్ణయించారు. 2007లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. భారత్, పాక్‌ల మధ్య నదీ జలాల ఒప్పందం తమకు అనుకూలంగా లేదని గతంలో జమ్మూ కశ్మీర్ ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో తాజా నిర్ణయాలతో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. ఒప్పందం ఇదీ.. 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సింధు(ఇండస్) జలాల ఒప్పందంపై సంతకం చేశారు. దాని ప్రకారం భారత్.. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని, పాక్ సింధు, చీనాబ్, జీలంల నీటిని వాడుకోవాలి. 9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని భారత్ వాడుకోవచ్చు. దీన్ని మరో 4.2 లక్షల ఎకరాలకు విస్తరించవచ్చు. భారత్ 8 లక్షల ఎకరాలకు సరిపడా నీటినే వాడుతోంది. అలాగే భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 3,034 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోంది. మరో 2,526 మెగావాట్ల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. 5,846 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి తుది దశలో ఉంది. తమకు తగినంత నీరు రావడం లేదంటూ పాక్ చాలాసార్లు అంతర్జాతీయ కోర్టుకెక్కింది.