ఫోన్ లేకుండా ఎంతసేపు ఉంటారు?
ఫోన్ లేకుండా ఎంతసేపు ఉంటారు?
Published Fri, Feb 24 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రపంచం తీరుతెన్నులే మారిపోయాయి. చేతిలో ఫోన్ లేకుండా.. లేదా అసలు ఫోన్ కనపడకుండా ఎంతసేపు ఉండగలరని చూస్తే, మహా అయితే కొద్ది నిమిషాలు మాత్రమేనని ఓ సర్వేలో తేలింది. 18-26 సంవత్సరాల మధ్య వయసున్నవాళ్లయితే స్మార్ట్ ఫోన్లకు మరీ ఎక్కువగా బానిసలు అవుతున్నారని, అంతకంటే చిన్నవాళ్లు, పెద్దవాళ్లు కూడా తక్కువ తినలేదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరినుంచైనా ఫోన్లు వాళ్లకు అందకుండా దూరంగా ఉంచితే, వాళ్లు విపరీతంగా ఒత్తిడికి లోనవుతున్నారట. వేరే ఫోన్ ఏదైనా ఇస్తే కాస్త ఒత్తిడి తగ్గుతోందని, అయినా తమ సొంత ఫోన్ దొరికే వరకు మాత్రం వాళ్లకు ఆందోళన ఎక్కువవుతోందని చెప్పారు. పక్క మనుషులతో మాట్లాడటం కంటే ఫోన్లు చూసుకుంటేనే ఎక్కువ సౌఖ్యంగా ఉంటున్నారని, చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి పక్కన పడుకున్నప్పటి కంటే దుప్పటి బాగా కప్పుకున్నప్పుడు సుఖంగా ఎలా ఉంటారో వీళ్ల పరిస్థితీ అంతేనని మానసిక వైద్య నిపుణులు విశ్లేషించారు. హంగేరిలోని యుట్వాస్ లొరాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.
ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలు, బొమ్మల లాంటి వస్తువులతో మనుషులకు మంచి అనుబంధం ఉంటుందని, అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లు కూడా జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలలో ఒకరైన వెరోనికా కొనాక్ తెలిపారు. ఫోన్లు కేవలం ముఖ్యమైన వస్తువులే కాకుండా, మన సామాజిక సంబంధాలను కూడా కలుపుతాయని, అందుకే అవి బాగా ముఖ్యం అయ్యాయని చెప్పారు. 18-26 సంవత్సరాల మధ్య వయసున్నవారిపై చేసిన ఈ పరిశోధనలో భాగంగా వారి హృదయ స్పందనలను కూడా నమోదు చేశారు. వాళ్లలో సగం మంది వద్ద ఫోన్లు తీసుకుని వాటిని ఓ కప్‌బోర్డులో పెట్టారు. సర్వేలో పాల్గొన్నవాళ్లంతా వేర్వేరు గదుల్లో కూర్చున్నారు. వాళ్లకు ఒక ల్యాప్‌టాప్ ఇచ్చి అందులో లెక్కలు, పజిల్స్ చేయమన్నారు. మూడున్నర నిమిషాల తర్వాత.. ఫోన్లు తమవద్ద లేనివాళ్లు తమ ఫోన్ ఎక్కడుందోనని వెతుకుతూ గడిపేశారు. అదే సమయంలో వాళ్ల గుండె కొట్టుకునే వేగం కూడా బాగా పెరిగింది.
ముఖాలు పదే పదే తడుముకోవడం, చేతులతో శరీరం మీద గోక్కోవడం, గోళ్లు కొరుక్కోవడం.. ఇలా ఒత్తిడికి సంబంధించిన అన్ని లక్షణాలు వారిలో కనిపించాయి. ఈమధ్య కాలంలో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడుతున్నారని, తల్లిదండ్రుల కంటే ఫోన్ల మీదే వాళ్లు ఎక్కువ ప్రేమ కనబరుస్తున్నారని వెరోనికా చెప్పారు. ఫోన్ దగ్గర లేనప్పుడు కలిగే ఆందోళనకు 'నోమోఫోబియా' అని పేరు పెట్టారు. దానికి 'నో మొబైల్ ఫోన్ ఫోబియా' అని అర్థం. ప్రతి ఐదుగురిలో నలుగురికి ఈ ఫోబియా కనిపిస్తోందని పరిశోధనలో తేలింది.
Advertisement
Advertisement