సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని కార్తీక్ ఇంట్లో వారితో మాట్లాడటం తగ్గించేశాడు. అందరూ ఉన్నా ముభావంగా వ్యవహరించడం, వణకడం, స్థిరత్వం లేనిచూపులు, నిలకడ లేని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు కలత చెందారు. అతనిలో వస్తున్న మార్పుతో నిపుణులను సంప్రదించగా నోమోఫోబియాతో బాధ పడుతున్నాడని తేల్చారు. సకాలంలో గుర్తించి కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో అతని సమస్యను పోగొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన మాదిరిగానే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదౌతున్నాయి.
నిత్యం ఫోన్‌లో ఆటలు, చాటింగ్ చేయడం, ఫేస్‌బుక్ వినియోగం, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు రాత్రి పగలు చేయడం నోమో ఫోబియాకు గురౌతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోబియా బారిన పడటానికి ప్రధాన కారణం యువత చదువుతున్నా, పడుకున్నా, తింటున్నా, బస్టాప్‌లో నిల్చున్నా, ఆఫీసులో ఉన్నా, సినిమా హాలుకు వెళ్లినా, బ్యాంక్‌కు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా వెంట సెల్‌ఫోన్‌లు పట్టుకుని అదే పనిగా వాటిని వాడడమేనని సర్వేలు చెబుతున్నాయి.
మొబైల్ వాడకం ఒక వ్యసనం
ఫోన్ లేకపోతే ఏర్పడే భయాన్నే నోమో ఫోబియాగా చెబుతుంటారు. నో మొబైల్ ఫోన్ నోబియా అనే పదం నుంచి సంక్షిప్తంగా దీనికి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సెల్‌ఫోన్‌లు వాడుతున్న దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ క్రమంలో ఈ రుగ్మతకు గురవుతున్న అత్యధిక బాధితుల సరసన కూడా చేరబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది యువత ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతున్నారు. దీని తర్వాత దశ నోమోఫోబియానే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది మధ్య పెద్ద వయస్కులు దీన్ని ఎదుర్కొంటున్నారు.
నోమోఫోబియా లక్షణాలు
► మొబైల్‌ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా ఆందోళనకు గురవుతారు.
► కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ముఖాముఖి కలిసేందుకు మానసిక సంసిద్ధత గణనీయంగా తగ్గిపోతుంది.
► ఒంటరితనం, కుంగుబాటుతో బాధపడతారు.
► బయటికి వెళ్లాల్సి వస్తే చార్జర్, పవర్‌బ్యాంక్, అదనపు డివైజ్‌లను వెంట తీసుకెళ్లాలనుకుంటారు.
► చెమటలు రావడం, వణుకుడు, ఆందోళన, తమను తామే కొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి.
ఇలా బయట పడొచ్చు
సకాలంలో ఈ లక్షణాలను పసిగట్టి తగిన మానసిక చికిత్స ఇప్పిస్తే సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, నెలలో ఒకరోజు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, వంటివాటికి దూరంగా ఉండటం, నిద్ర పోవడానికి ముందు వీటిని కనీసం పదిహేను అడుగుల దూరంలో ఉంచడం చేయాలి. ఫోన్ పక్కనే ఉంటే నిద్రా భంగమే. కుటుంబసభ్యులు, స్నేహితులు వీరితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సాధారణ పరిస్థితులు సృష్టించవచ్చన్నదే నిపుణులు చెప్పేమాట. ఇటీవల ప్రధాన పట్టణాల్లో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఫోన్‌లో కాకుండా నేరుగా కలిసి మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్‌లతో చేయాల్సిన పనులకు ఒక నిర్ణీత సమయం పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ అవసరం.
మరిన్ని ప్రత్యామ్నాయాలు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో సెల్‌ఫోన్లను నిషేధించింది. దీనిని పాఠశాలలు, కళాశాలలకే పరిమితం చేయకుండా విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధానం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు కార్యాలయాల్లోని యువతకు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్‌లు తప్పని సరి. అక్కడే విధులు నిర్వర్తించడానికి రెండురోజులు వారాంతపు సెలవులున్నా, ఎక్కువ మంది వాటి ద్వారా ఆయా రోజుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. ఈ పనులకంటూ కచ్చితమైన ఒక సమయం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బానిసలౌతున్న యువత
మొబైల్ ఫోన్‌లకు యువత బానిసలవుతున్నారని అంతర్జాతీయ సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 23 శాతం యువత నోమోఫోబియాకు గురవుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా ఈ కేసులు నమోదౌతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ కేసుల లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువత, విద్యార్థులు రోజలో కనీసం 31 పర్యాయాలు సెల్‌ఫోన్ చూసుకుంటున్నారు. సుమారు 3 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారని తేలింది. పదేపదే ఈ రకమైన కాలక్షేపం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు.
నోమోఫోబియా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య నుంచి దూరం చేయవచ్చు. ఆలోచనల్లో మార్పులు తీసుకురావడం, టాక్ థెరపీ, విశ్రాంతి వంటి పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. నెట్ వర్క్‌ను పరిమితంగా వినియోగించుకొనేలా మార్గనిర్ధేశం చేస్తాం. ఫోన్‌కు దూరమైతే నోమో ఫోబియా దూరమౌతుంది. – శ్రీహరి, మానసిక నిపుణుడు
విపరీత వినియోగంతో ఫోబియా
సెల్ ఫోన్‌ను విశ్రాంతి లేకుండా అదే పనిగా వినియోగించడం వల్ల యువత అనేక రగ్మతలకు గురౌతోంది. అలాంటి కేసులు తరచూ వస్తున్నాయి. తలనొప్పి, నరాలు పట్టేయడం, స్థిరత్వం లేని మాటలు ఆడటం వంటి కేసులు వస్తున్నాయి. అన్నం తిన్నా, పడుకోవడానికి వెళ్లినా, చివరికి బాత్‌రూంకు వెళ్లినా సెల్‌ఫోన్ పట్టుకుని వెళ్లే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో గుర్తించిన ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ కోసం రిఫర్ చేస్తున్నాం.
– డాక్టర్ నాగభూషణ్‌రావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment