సృజనశీలి..
మార్క్ జుకర్‌బర్గ్
ఫేస్‌బుక్ అంటే... ఒక అలవాటు.
144 కోట్ల మందికి దాన్ని అలవాటు చేసింది జుకర్‌బర్గ్
హైస్కూల్లో ఉండగానే సినాప్స్ పేరిట పండోరా మ్యూజిక్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు దాన్ని కొంటామన్నా, ఉద్యోగం కూడా ఇస్తామన్నా తిరస్కరించాడు.
పాతికేళ్లు నిండకుండానే బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయాడు జుకర్‌బర్గ్. ఇటీవల జన్మించిన తన కుమార్తెకు బహుమతిగా బహిరంగ లేఖ రాస్తూ... కంపెనీలోని తన వాటాలో 99 శాతాన్ని దాతృత్వానికే వినియోగిస్తానని ప్రకటించారాయన. 1984 మే 14న న్యూయార్క్‌లోని వైట్‌ప్లెయిన్స్‌లో పుట్టాడు మార్క్. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 12 ఏళ్లకే ‘జుక్‌నెట్’ పేరిట చిన్న మెసేజింగ్ సర్వీస్‌ను తయారు చేశాడు. దీన్ని మార్క్ తండ్రి తన డెంటల్ క్లినిక్‌లో వాడారు. కొత్త పేషెంట్లు వచ్చినపుడు రిసెప్షనిస్టు అరవకుండా మెసేజ్ పంపటం సాధ్యమయ్యేది.
2002లో హార్వర్డ్‌లో చేరాడు. ఫేస్‌బుక్‌కు బీజం పడిందీ అక్కడే. స్నేహితులు దివ్య నరేంద్ర, టైలర్ వింక్లెవోస్, కామెరాన్‌తో కలిసి ‘హార్వర్డ్ కనెక్ట్’ పేరిట సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌ను తయారు చేశాడు. హార్వర్డ్ విద్యార్థులకుద్దేశించిన ఈ ప్రాజెక్టు నుంచి జుకర్‌బర్గ్ మధ్యలోనే విరమించుకుని సొంత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌పై దృష్టిపెట్టాడు. స్నేహితులు డస్టిన్ మోస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్, సావెరిన్‌తో కలిసి ఫేస్‌బుక్‌ను రూపొందించాడు. 2005లో ఫేస్‌బుక్‌కు భారీ నిధులొచ్చాయి. అయితే జుకర్‌బర్గ్ తమ ఐడియాను కాపీ కొట్టాడని నరేంద్ర తదితరులు బయటపడ్డారు.
మొదట్లో కాదని చెప్పినా... తరవాత క్షమాపణ చెప్పి... వారికి 65 మిలియన్ డాలర్లిచ్చి వివాదాన్ని పరిష్కరించుకున్నాడు. ఫేస్‌బుక్ విలువ బాగా పెరగటంతో ఆ మొత్తం సరిపోదన్నారు. ఆ వివాదం కొన్నాళ్లు సాగింది కూడా. 2012 మే 12న ఫేస్‌బుక్ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఆ మర్నాడే స్నేహితురాలు ప్రిస్సిలా చాన్‌ను జుకర్‌బర్గ్ వివాహం చేసుకున్నాడు. సంస్థలో 24 శాతం వాటా మార్క్‌దే. దాని విలువ 45 బిలియన్ డాలర్లకుపైనే.