అలాంటి స్కూలుకు పిల్లలను ఎలా పంపాలి?
గుర్గావ్: ఓ అంతర్జాతీయ స్కూల్‌లో చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బస్సు డ్రైవర్ కిరాతకంగా హతమార్చిన ఘటనపై గుర్గావ్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట భారీ ప్రజలు గుమిగూడి శనివారం ఉదయం ఆందోళన నిర్వహించారు. బాలుడి హత్యతో కలత చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగడంతో.. ఇక్కడ భారీగా భద్రతా దళాలను మోహరించారు.
మరోవైపు తన కొడుకును కిరాతకంగా హత్యచేయడంపై తల్లి జ్యోతి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన బిడ్డకు పాఠశాల యాజమాన్యం కనీస భద్రతను కల్పించలేదని, ఇలాంటి స్కూల్‌కు పిల్లలను ఎలా పంపించాలని ఆమె ప్రశ్నించారు. దారుణానికి ఒడిగట్టిన బస్ కండక్టర్ ఎవరో తన కొడుకుకు కనీసం తెలియదని, తను ఎప్పుడూ స్కూల్‌బస్సులో వెళ్లలేదని, తామే స్కూల్ వద్ద దిగబెట్టి.. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేవాళ్లమని జ్యోతి వివరించింది. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలంటూ బాలుడి తండ్రి గుర్గావ్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
రెండో తరగతి విద్యార్థి అయిన ప్రద్యుమన్ ఠాకూర్ స్కూల్ ఆవరణలోనే హత్యకు గురికావడం గుర్గావ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న అశోక్.. స్కూలు టాయిలెట్‌లో బాలుడిపై అత్యాచారానికి ప్రయత్నించాడని.. దీన్ని ప్రతిఘటించిన చిన్నారి అరవటంతో అక్కడే గొంతుకోసి హతమార్చాడని పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోహ్న ప్రాంతంలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ (7) శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పాఠశాల టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో పడి ఉండడాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం స్కూల్ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.