
నువ్వులేక నేను లేను..
భర్త చనిపోయాడనే బాధతో రోదిస్తూ.. దింపుడు కల్లం వద్దే భార్య మృతి
హుస్నాబాద్ రూరల్: అన్యోన్య జీవితం గడిపి పిల్లలను ప్రయోజకుల్ని చేసిన ఆ దంపతులు మరణంలోనూ తోడు వీడలేదు. భర్త మరణించడంతో గుండలవిసేలా విలపించిన భార్య కడకు ఆయనతోనే వెళ్లిపోరుుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ బుడిగజంగాల కాలనీకి చెందిన చెన్నూరు రాములు(65), వెంకమ్మ(60) దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూమార్తెలున్నారు. రాములు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఆయనకు ఏ లోటూ రాకుండా భార్య వెంకమ్మ సపర్యలు చేసింది. ఈక్రమంలో రాములు బుధవారం మృతి చెందగా, భార్య వెంకమ్మ బాగా రోదించింది. గురువారం సాయంత్రం అంత్యక్రియలు చేసేందుకు వెళ్తున్నారు. దింపుడు కల్లం కార్యక్రమంలో భాగంగా హిందూ సాంప్రదాయ ప్రకారం చనిపోయిన వారి నోటిలో ఏదైనా బంగారు వస్తువును పెడుతుంటారు. భర్త నోటిలో చెవి పోగును పెడుతూనే రోదిస్తున్న వెంకమ్మ.. నువ్వు సచ్చినంక నేనెవరి కోసం బతుకాలె.. అని రోదిస్తూ కుప్పకూలిపోరుుంది. వెంటనే ఆమెను అస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.